నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం
- జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
విశ్వంభర, సంగారెడ్డి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు పారిశుధ్యం, విద్యార్థులకు అందే సౌకర్యాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ఆదేశించారు.ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఇస్నాపూర్‌లోని జెడ్పీ హైస్కూల్ మరియు డంపింగ్ యార్డును పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనం, పారిశుధ్యం, ఉపాధ్యాయుల హాజరు తదితర అంశాలను పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తూ, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే దిశగా కృషి చేస్తుందన్నారు. పదవ తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు చదువుపై మరింత దృష్టి సారించాలని సూచించారు. హాల్ టికెట్లు అందాయా, అందులో వివరాలు సరిగ్గా ఉన్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పరీక్షలకు రివిజన్ చేస్తున్నారా అని ప్రశ్నిస్తూ ఎలాంటి ఆందోళనలకు గురికాకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని విద్యార్థులను ప్రోత్సహించారు.పాఠశాలలో మధ్యాహ్న భోజన షెడ్యూల్ సరిగా అమలు కావడం లేదని గుర్తించిన కలెక్టర్, సంబంధిత సంస్థకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు గుడ్లు అందించడం లేదని గమనించి, వెంటనే అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాల హెడ్‌మాస్టర్ అనుమతి లేకుండా గైర్హాజరు కావడంఫై ఆగ్రహించిన కలెక్టర్ హెచ్ఎంకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని, అదేవిధంగా కొంతమంది ఉపాధ్యాయులు గైర్హాజరు కావడం పై ఎంఈఓ వివరణ ఇవ్వాలని, పర్యవేక్షణ లోపించినందుకు ఎంఈఓకు కూడా షోకాజ్ నోటీసు ఇవ్వాలని జిల్లా విద్యాధికారికి సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించబోమని కలెక్టర్ స్పష్టం చేసారు.శానిటేషన్ గ్రాంట్ కింద ఎంత మందిని ఎంగేజ్ చేసుకుంటున్నారో, వారి పేర్లు, ఎప్పటి వరకు పేమెంట్ చేశారన్న వివరాలను అందించాలని సూచించారు.పాఠశాలలో పారిశుధ్య నిర్వహణ సరిగ్గా లేకపోవడం , డైనింగ్ హాల్ సరిగా శుభ్రం చేయకపోవడం పై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని డంపింగ్ యార్డును పరిశీలించిన కలెక్టర్, అక్కడ మంటలు చెలరేగిన ప్రాంతాన్ని 24 గంటల్లో వాటర్ ట్యాంకర్ల సహాయంతో పూర్తిగా ఆర్పివేయాలని ఆదేశించారు. సెగ్రిగేషన్ ప్రాంతంలో ఉన్న లెగసీ వ్యర్థాలను 48 గంటల్లో పూర్తిగా తరలించి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయాలని సూచించారు. డంపింగ్ యార్డ్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అక్రమంగా చెత్త వేయకుండా 24 గంటల పర్యవేక్షణ ఉండేలా ఒక కార్మికుడిని నియమించాలని ఆదేశించారు. అలాగే వ్యర్థాలను సేకరించే మున్సిపల్ ఆటోలు, ప్రైవేట్ వాహనాల ద్వారా చెత్తను ఎక్కడ ప్రాసెస్ చేస్తున్నారు, ఎక్కడికి తరలిస్తున్నారు అనే అంశంపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఆయా అంశాలపై వెంటనే చర్యలు తీసుకొని యాక్షన్ టేకన్ రిపోర్ట్ ను సమర్పించాలని సంబంధిత మున్సిపల్ కమిషనర్ కు సూచించారు.ఈ సందర్శనలో కలెక్టర్ వెంట మున్సిపల్ చైర్ పర్సన్ సుమలత, మున్సిపల్ కమిషనర్, తహసిల్దార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.



