కిషన్ రెడ్డి రాజకీయం చేయడం మానుకోని..సర్వీస్ చేయడం నేర్చుకో : జగ్గారెడ్డి
- గుల్జార్ హౌస్ లో ఘటన జరిగిన నిమిషాల్లోనే చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు
- 17 మంది చనిపోవడం బాధాకరమే.. సీఎం రేవంత్ కూడా వాళ్ళను బతికించే ప్రయత్నం చేశారు.
- కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి ని అని మర్చిపోయి గల్లీ లీడర్ ల మాటాడుతున్నారు.
- కేటీఆర్ డైరెక్షన్ లోనే కిషన్ రెడ్డి అలా మాట్లాడారని ప్రచారం జరుగుతుంది.
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్
విశ్వంభర , హైదరాబాద్ : కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పై టీపీసీసీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, హైదరాబాద్ పాతబస్తీ గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే స్పందించి, జిహెచ్ఎంసి అధికారులను అలెర్ట్ చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారని తెలిపారు. సీఎం అక్కడికి వెళితే సహాయక చర్యలకు ఇబ్బందులు అవుతాయని, అందుకే సీఎం రేవంత్ ఆదేశాలతో డిప్యూటీ సిఎం భట్టి,మంత్రులు పొన్నం,దామోదర రాజనర్సింహ,ఎంపీ అనిల్ యాదవ్,మేయర్ విజయలక్ష్మి ఘటనా స్థలానికి వెళ్లి స్వయంగా పరిశీలించారని పేర్కొన్నారు. బాధితులను కాపాడేందుకు చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ ప్రభుత్వం చేసింది, అయినా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేయడం కరెక్ట్ కాదని జగ్గారెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానేసి.. ఘటనా స్థలంలో కిషన్ రెడ్డి సహాయక చర్యల్లో పాల్గొనాల్సింది అని సెటైర్ వేశారు.కేంద్ర మంత్రి గా కిషన్ రెడ్డి అవసరం అయితే ప్రధాని మోదీ తో మాట్లాడాలి, లేదంటే సీఎం తో మాట్లాడి పలు సూచనలు చేస్తే బాగుండేది కానీ గల్లీ లీడర్ ల మాట్లాడటం బాధ అనిపించిందని పేర్కొన్నారు.
కేటీఆర్ డైరెక్షన్‌లో కిషన్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. బాధితులను కాపాడే టెన్షన్‌లో ప్రభుత్వం ఉంటే.. కిషన్ రెడ్డి ఘటనా స్థలానికి వచ్చి రాజకీయం చేశారని మండిపడ్డారు. ఎక్కడ రాజకీయాలు చేయాలో కూడా కేంద్రమంత్రికి తెలియదా? అని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.చర్ల పల్లి రైల్వే స్టేషన్ ఈదురు గాలి కే రేకులు పడిపోలేదా? భారత మాతకు హారతి లో ట్యాంక్ బండ్ లో టపాకాయలు కాల్చితే ముగ్గురు అనుకోకుండా చనిపోతే సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేశారా? అని ప్రశ్నించారు.గుజరాత్ లో బ్రిడ్జి కూలిపోతే 140 మంది చనిపోతే రాహుల్ గాంధీ రాజకీయం చేశారా..? కిషన్ రెడ్డి నీవెందుకు అనుకోకుండా జరిగిన ప్రమాదం పై రాజకీయం చేస్తున్నావు అని జగ్గారెడ్డి మండి పడ్డారు.నా సీనియర్ గా నిన్ను గౌరవిస్తా, కానీ కిషన్ రెడ్డి రాజకీయం చేయడం మానుకో, సర్వీస్ చేయడం నేర్చుకో అని హితవు పలికారు.



