తొమ్మిదేళ్ల తర్వాత నేను సీఎం అయ్యేందుకు కృషి చేస్తా : జగ్గారెడ్డి
ఈ మూడేళ్లు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రిగా కొనసాగుతారు.
- రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన అద్భుతంగా సాగుతుంది.
- తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రైతుభరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది
- మరో ఐదేళ్లు కూడా సీఎం అయ్యేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారు
- లిక్కర్ స్కాంలో వందల కోట్లు కవితకు ఎక్కడివి?
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం
విశ్వంభర, హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన చర్చకు తెరలేపారు. ముఖ్యమంత్రి పదవిపై తన ఆకాంక్షను పరోక్షంగా వెల్లడిస్తూనే, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గురువారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి పదవి గురించి జగ్గారెడ్డి మాట్లాడుతూ, వచ్చే మూడేళ్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని, ఆ తర్వాత ఐదేళ్ల కాలానికి కూడా ముఖ్యమంత్రి కావడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. అయితే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన తర్వాత తానూ ముఖ్యమంత్రి అయ్యేందుకు ప్రయత్నిస్తానని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఆ సమయంలో తన అభ్యర్థిత్వాన్ని ప్రజల ముందు ఉంచుతానని ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన అద్భుతంగా సాగుతుందని ఆయన అన్నారు. గతంలో రైతు బంధు వేసేందుకు బీఆర్ఎస్ ఐదు నెలల టైం తీసుకునేదని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం తొమ్మిది రోజుల్లోనే రైతుభరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమచేసిందని ఆయన అన్నారు. బీఆర్ఎస్ హయంలో డబ్బులు అందుబాటులో ఉండి కూడా వేయలేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు కడుతూ కూడా రైతు భరోసా వేసిందన్నారు.
మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కూడా జగ్గారెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అంతా ఫోన్ ట్యాపింగ్‌తోనే నడిచిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు అంతా ఏం చేస్తున్నారని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిఘా పెట్టిందని. తన ఫోన్ కూడా ట్యాప్ అయినట్టు పోలీసులు తనకు చెప్పినట్టు తెలిపారు. కాంగ్రెస్ నాయకుల ఫోన్‌లు ట్యాప్ చేయడంపైన దృష్టి పెట్టిన బీఆర్ఎస్ గత పదేళ్ల రాష్ట్ర పాలనను గాలికొదిలేసిందని విమర్శించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేస్తున్న వ్యాఖ్యలపై జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. కవిత ప్రతి విషయాన్ని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆమె బీఆర్ఎస్‌లో ఉన్నా బయటకు వచ్చినా పెద్ద తేడా ఏమీ ఉండదని అన్నారు. కవిత మాట్లాడే మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని విమర్శించారు. సాధారణంగా తండ్రి రాజకీయ వారసత్వం కుమారుడికి వస్తుందని, ఒకవేళ కుమారుడు లేకపోతే కుమార్తెకు అవకాశం దక్కవచ్చని వ్యాఖ్యానించారు.
తాము స్పందించే స్థాయి నాయకురాలు కవిత కాదన్నది తమ అభిప్రాయమని జగ్గారెడ్డి అన్నారు. కవిత ఎందుకు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమాన ప్రాధాన్యత కలిగిన నేతలని, వారు రాజకీయంగా ఒకరినొకరు విమర్శించుకుంటే అర్థం ఉంటుందని తెలిపారు.తమ గురించి కవిత అనవసరంగా ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో కవిత ప్రమేయంపై జగ్గారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ స్కాంలో పెట్టుబడులు పెట్టడానికి కవితకు ఇన్ని వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని జగ్గారెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.



