ఫీజుల వేధింపులతో విద్యార్థి మృతి
- ఇది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్య : ఆర్. కృష్ణయ్య
విశ్వంభర, విద్యానగర్ : ఫీజుల బకాయిల కారణంగా ఇంజనీరింగ్ విద్యార్థి ప్రణీత్ మృతి ఆత్మహత్య కాదని, ఇది ప్రభుత్వ హత్యేనని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య తీవ్రంగా విమర్శించారు. మంగళవారం హైదరాబాదు విద్యానగర్ బీసీ భవన్‌లో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశం బీసీ విద్యార్థి సంఘం కన్వీనర్ మోడీ రాందేవ్ అధ్యక్షతన జరిగింది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కాలేజీ యాజమాన్యాలు ఫీజుల కోసం ఒత్తిడి తెస్తూ సర్టిఫికెట్లు, హాల్ టికెట్లు నిలిపివేస్తున్నాయని అన్నారు. దీంతో విద్యార్థులు చదువులు ఆపడం, ఉద్యోగాలు కోల్పోవడం వంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. గత 30 నెలల్లో ఇదే సమస్యపై పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని, అనేకసార్లు ఆందోళనలు జరిగినా ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని పరోక్షంగా ఎత్తివేయాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఉన్నత విద్యను దెబ్బతీసే విధంగా చర్యలు కొనసాగు తున్నాయని, వెంటనే బకాయిలు విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థి మరణానికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, సంబంధిత కాలేజీ గుర్తింపును రద్దు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఫీజులు చెల్లించే సామర్థ్యం లేని పేద విద్యార్థుల కోసం ఈ పథకం ఏర్పాటైంది. దీనివల్ల లక్షలాది కుటుంబాలు అభివృద్ధి చెందాయి. ఇప్పుడు అదే పథకాన్ని బలహీనపరిచే చర్యలు జరుగుతున్నాయి” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజేందర్, అనంతయ్య,, నిఖిల్ పటేల్ తదితర బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల ప్రతినిధులు
పాల్గొన్నారు.



