ఎన్నికల నగారా.. జిల్లాల బాట పట్టనున్న సీఎం రేవంత్! 

'త్రిముఖ వ్యూహం'తో ప్రచార భేరి

ఎన్నికల నగారా.. జిల్లాల బాట పట్టనున్న సీఎం రేవంత్! 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలకు సిద్ధమయ్యారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడంతో పాటు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసన సభలు నిర్వహించడమే లక్ష్యంగా సీఎం రోడ్‌మ్యాప్ ఖరారైంది.

విశ్వంభర, తెలంగాణ న్యూస్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలకు సిద్ధమయ్యారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడంతో పాటు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసన సభలు నిర్వహించడమే లక్ష్యంగా సీఎం రోడ్‌మ్యాప్ ఖరారైంది.

జనవరి 16 నుంచి రెండు దఫాల్లో ఈ పర్యటనలు సాగనున్నాయి. ఈ సారి పర్యటనను సీఎం రేవంత్ రెడ్డి అత్యంత వ్యూహాత్మకంగా ప్లాన్ చేశారు. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా అటు అభివృద్ధి, ఇటు పోరాట పంథాను ఎంచుకున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణ ప్రాంతాల్లో పార్టీ బలాన్ని పెంచేలా బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు  వివిధ జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ కేంద్రంపై పోరు బాట చేపట్టనున్నారు. 

Read More కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు పెద్దపీట వేయండి

తొలి విడత షెడ్యూల్ 
మొదటి విడతలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో సీఎం పర్యటించనున్నారు. జనవరి 16న నిర్మల్‌లో బహిరంగ సభ, అభివృద్ధి పనులకు శ్రీకారం చేయనున్నారు. 17న జడ్చర్లలో కార్యకర్తలతో భేటీ, ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు.
18న పాలేరు, ఖమ్మం జిల్లా కేంద్రాల్లో పర్యటించనున్నారు. అదే రోజు మేడారంలో జరిగే కేబినెట్ భేటీలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటన..
జనవరి 19న సీఎం రేవంత్ రెడ్డి మేడారం అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం నేరుగా విదేశీ పర్యటనకు బయలుదేరనున్నారు.  రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సింగపూర్, అమెరికా, స్విట్జర్లాండ్‌లోని దావోస్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలు, సమావేశాల ముగింపు అనంతరం ఫిబ్రవరి 1న తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. 

ఫిబ్రవరి 3 నుంచి మలి విడత 
విదేశీ పర్యటన ముగిసిన వెంటనే ఫిబ్రవరి 3వ తేదీ నుంచి రెండో విడత పర్యటనలు ప్రారంభమవుతాయి. వరుసగా ఆరు రోజుల పాటు నల్లగొండ, కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో సీఎం పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేస్తూనే, ఉపాధి హామీ నిరసన సభలను భారీ ఎత్తున నిర్వహించేలా స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. మొత్తానికి, మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వాతావరణాన్ని కాంగ్రెస్‌కు అనుకూలంగా మార్చుకోవాలని రేవంత్ రెడ్డి పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.