ఈ రాత్రి హైదరాబాదులో ఫ్లైఓవర్ల మూసివేత..!!
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లో ముస్లింలు పవిత్రంగా జరుపుకునే ‘షబ్-ఎ-మెరాజ్’ సందర్భంగా నగరంలో ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణలు అమలు చేయబడ్డాయి.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లో ముస్లింలు పవిత్రంగా జరుపుకునే ‘షబ్-ఎ-మెరాజ్’ సందర్భంగా నగరంలో ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణలు అమలు చేయబడ్డాయి. పోలీసులు ప్రకటించినట్లుగా, శుక్రవారం రాత్రి 10 గంటల తర్వాత నగరంలోని అన్ని ఫ్లైఓవర్లను తాత్కాలికంగా మూసివేస్తారు. రోడ్డు భద్రతను మరియు ట్రాఫిక్ నియంత్రణను క్రమబద్ధం చేయడానికి ఈ చర్య తీసుకున్నట్టు పేర్కొన్నారు. అలాగే హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న నెక్లెస్ రోడ్ కూడా మూసివేయనున్నారు.
అయితే, గ్రీన్‌ల్యాండ్స్ ఫ్లైఓవర్, పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే, లంగర్ హౌస్ ఫ్లైఓవర్‌లకు ఈ ఆంక్షలు వర్తించవు అని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవిస్ తెలిపారు. అవసరాన్ని బట్టి తెలంగాణ తల్లి, షేక్‌పేట్, బహదూర్‌పురా ఎక్స్ రోడ్ ఫ్లైఓవర్లను కూడా మూసివేయవచ్చని తెలిపారు. ప్రజలు ఈ మార్పులను గమనించి ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలి, పోలీసుల సూచనలకు అనుగుణంగా సహకరించాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ట్రాఫిక్ హెల్ప్‌లైన్ 9010203626 కు కాల్ చేయవచ్చని సూచన ఇచ్చారు.
ఇక మరోవైపు, ఇటీవల పాతబస్తీలోని పురానాపూల్‌లో జరిగిన మత ఘర్షణల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టంగా చేశారు. జనవరి 14న రాత్రి ఓ వ్యక్తి మైసమ్మ ఆలయంలోని ఫ్లెక్సీ, విగ్రహాలను పాక్షికంగా ధ్వంసం చేశాడు. దీనికి ప్రతిగా సుమారు 300 మంది సమూహంగా సమీపంలోని ‘చిల్లా’పై దాడికి దిగారు. ఈ ఘటనల నేపథ్యంలో పాతబస్తీ ప్రాంతంలోని సున్నితమైన ప్రదేశాల్లో ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. ఆలయంలో విధ్వంసానికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు, రెండు ఘటనలపైనా కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు.



