సంక్రాంతి జోష్.. ఆర్టీసీ ఫుల్ ఖుష్!

ఐదు రోజుల్లోనే రూ.67.40 కోట్ల ఆదాయం 

సంక్రాంతి జోష్.. ఆర్టీసీ ఫుల్ ఖుష్!

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TG-RTC)కు ఈ ఏడాది సంక్రాంతి పండుగ కాసుల పంట పండించింది. పల్లె బాట పట్టిన ప్రయాణికులతో బస్సులు కిటకిటలాడటంతో సంస్థ ఖజానా కళకళలాడుతోంది.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TG-RTC)కు ఈ ఏడాది సంక్రాంతి పండుగ కాసుల పంట పండించింది. పల్లె బాట పట్టిన ప్రయాణికులతో బస్సులు కిటకిటలాడటంతో సంస్థ ఖజానా కళకళలాడుతోంది. కేవలం ఐదు రోజుల్లోనే రికార్డు స్థాయి ఆదాయం సాధించి ఆర్టీసీ తన సత్తా చాటింది. ఈ నెల 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఐదు రోజుల వ్యవధిలో టికెట్ విక్రయాల ద్వారా రూ.67.40 కోట్ల ఆదాయం లభించినట్లు అధికారులు ప్రకటించారు. సగటు రోజు వారి ఆదాయం రూ.13.48 కోట్లు ఉండగా.. ప్రత్యేక సర్వీసుల ద్వారా రోజుకు అదనంగా రూ.2.70 కోట్ల ఆదాయం సమకూరింది. 

 
ఈ ఏడాది సంక్రాంతికి వరుస సెలవులు (డబుల్ వీకెండ్) రావడంతో ఉద్యోగులు, విద్యార్థులు భారీగా స్వగ్రామాలకు పయనమయ్యారు. ప్రయాణికుల రద్దీని ముందే ఊహించిన ఆర్టీసీ, సుమారు 6,431 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చింది. ప్రైవేట్ వాహనాల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ, ఆర్టీసీ సురక్షిత ప్రయాణాన్ని అందించడంతో జనం కూడా ప్రభుత్వ బస్సులకే జై కొట్టారు.

Read More ఘనంగా వనస్థలి జాతిరత్న పురస్కారాలు - వనస్థలిపురం భక్త సమాజం - గద్దె విజయ్ నేత సంయుక్తంగా ప్రధానం 

తిరుగు ప్రయాణానికి సిద్ధం.. 
పండుగ ముగించుకుని తిరిగి పట్నం వస్తున్న వారి కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దీంతో పాటు భారీగా స్పెషల్ సర్వీసులు నడుపుతున్నారు. ప్రధాన జంక్షన్లు, బస్టాండ్ల వద్ద అధికారుల పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్ చేరుకునే ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక డ్రాపింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. నష్టాల్లో ఉన్న సంస్థకు ఈ స్థాయి ఆదాయం రావడం పెద్ద ఊరటని.. ప్రైవేట్ ట్రావెల్స్ కంటే ఆర్టీసీని నమ్మిన ప్రజలకు రవాణా అధికారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.