జాతరకు ముస్తాబైన గట్టు మైసమ్మ ఆలయం
విశ్వంభర, చింతపల్లి: భక్తులు కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా పేరొందిన శ్రీ గట్టు లక్ష్మీ మైసమ్మ జాతర ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. హైదరాబాద్ - నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారిపై చింతపల్లి, నసర్లపల్లి గ్రామాల మధ్య రోడ్డు పక్కనే శ్రీగట్టు లక్ష్మీ మైసమ్మమాత ఆలయాన్ని సుమారు 30 ఏళ్ల క్రితం నిర్మించారు. అంతకు ముందు ఇక్కడ చిన్న గుడి మాత్రమే ఉండేది. భక్తులు ఇచ్చిన విరాళాలతో అమ్మవారి విగ్రహాన్ని పదేళ్ల క్రితం ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించారు. ఆలయ నిర్మాణం పూర్తిస్థాయిలో జరగాల్సి ఉంది. ఈ దేవాలయం రాష్ట్ర రహదారి పక్కనే ఉండడంతో మండల ప్రజలే కాక ఇతర మండలాల ప్రజలు ఎంతో నమ్మకంతో అమ్మవారిని కొలుస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే నాగుల పుట్ట ఉంది. తనను నమ్మిన భక్తులను చల్లగా చూసే చల్లని తల్లి, కరుణించి కాపాడే ముగ్గురమ్మ మూళ్లపుటమ్మ శ్రీ గట్టు లక్ష్మీ మైసమ్మ జాతర ఉత్సవాలు 12 నుంచి మూడు రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం జాతర ప్రారంభం, అమ్మవారి పూజ, శుక్రవారం బోనాలు, పలహారపు బండ్లు, వనవా సం, అన్నదానం, 14న జాతర ముగింపు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నారు. జాతర ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఆలయ నిర్మాణం, ఉత్సవాలను భక్తుల విరాళాలతో ఏటా ఘనంగా నిర్వహించుకోవడం విశేషం. ఉత్సవాల సందర్భంగా భజనలు, సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పీఠాధిపతులు దున్న ఇద్దయ్య. పర్వతనంద స్వాములు ప్రతిష్టించిన ఈ గట్టు లక్ష్మీ మైసమ్మ ఆలయం ముస్తాబవుతున్న మైసమ్మ దేవాలయం, ప్రత్యేక అలంకారంలో అమ్మవారు. దీంతో అమ్మవారి దర్శనం అనంతరం పుట్టలో పాలు పోసి, గుడ్డు పెట్టి నాగులకు పూజలు నిర్వహిస్తారు. భక్తులు ప్రతి ఆది, శుక్రవారాల్లో ముడుపులు కట్టి కోర్కెలు కోరుకుంటారు. కోరిన కోర్కెలు తీరగానే అమ్మవారికి పూజలు జరిపి కందూళ్లు చేస్తారు. రహదారిపై వచ్చిపోయే భక్తులతో ఆలయం ఎల్లప్పుడూ సందడిగా ఉంటుంది. నూతన వాహనాలు కొనుగోలు చేసి పూజలు చేయిస్తుంటారు.



