ఆ ప్రాజెక్టులన్నీ కేసీఆర్ మార్కు..
95 శాతం పనులు మా హయాంలోనే పూర్తి: కేటీఆర్
రాష్ట్రంలో కీలకమైన సాగునీటి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం రాజకీయంగా చర్చకు దారితీసింది. ఆదిలాబాద్ జిల్లా భోరాజ్ మండలం హాతీఘాట్ వద్ద చనాక - కొరాట పంప్ హౌస్ ను, జగిత్యాల జిల్లాలోని సదర్‌మాట్ బ్యారేజ్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
విశ్వంభర, తెలంగాణ, న్యూస్: రాష్ట్రంలో కీలకమైన సాగునీటి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం రాజకీయంగా చర్చకు దారితీసింది. ఆదిలాబాద్ జిల్లా భోరాజ్ మండలం హాతీఘాట్ వద్ద చనాక - కొరాట పంప్ హౌస్ ను, జగిత్యాల జిల్లాలోని సదర్‌మాట్ బ్యారేజ్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ.. ఈ ప్రాజెక్టుల ఘనత తమ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు పనులు కేసీఆర్ పాలనలోనే 95 శాతం పూర్తయ్యాయని, సెప్టెంబర్ 2023లోనే విజయవంతంగా ట్రయల్ రన్ కూడా నిర్వహించామని ఆయన గుర్తు చేశారు. 2016లో మహారాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న అంతర్రాష్ట్ర ఒప్పందం వల్లే ఈ ప్రాజెక్ట్ సాధ్యమైందని తెలిపారు. 0.98 టీఎంసీల సామర్థ్యం గల ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లోని 89 గ్రామాలకు చెందిన 51 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు.
సదర్‌మాట్ బ్యారేజ్‌తో మారనున్న తలరాత
జగిత్యాల, నిర్మల్ జిల్లాల సరిహద్దుల్లో గోదావరిపై 1.58 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన సదర్‌మాట్ బ్యారేజ్ కూడా కేసీఆర్ హయాంలోనే 90 శాతం పూర్తి అయ్యిందని వెల్లడించారు.దీని ద్వారా 18 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుందని తెలిపారు. గత పదేళ్లలో (2014-2023) కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వ్యవసాయ రంగం ఊహించని రీతిలో అభివృద్ధి చెందిందని కేటీఆర్ కొనియాడారు. నెర్రెలుబారిన తెలంగాణ నేలను దేశానికే ధాన్యాగారంగా మార్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ప్రారంభించిన పనులు నేడు ఫలాలను ఇస్తుండడం సంతోషదాయకమని పేర్కొన్నారు.



