ఉద్యోగులకు ప్రతినెల 1 వ తేదీన వేతనం చెల్లించాలి
విశాఖపట్నం,విశ్వంభర :- విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు ప్రతినెల 1వ తారీకు వేతనం చెల్లించాలని స్టీల్ సిఐటియు ప్రతినిధులు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. నేడు స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో ఈడి (వర్క్స్) భవనం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఈడి (వర్క్స్) సొప్తి గారికి వారి కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్టీల్ సిఐటియు గౌరవాధ్యక్షులు జె అయోధ్యరామ్ మాట్లాడుతూ గడచిన ఆరు మాసాలుగా ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించడం లేదని ఆయన అన్నారు. జీతం ఉద్యోగుల హక్కుని, ప్రతి నెల 1 వ తేదీ జీతం చెల్లించడం యాజమాన్య కనీస బాధ్యత అని ఆయన వివరించారు. జీతం సగం సగం చెల్లించడం ద్వారా బ్యాంకులకు ఉద్యోగులు డిఫాల్ట్ అవుతున్నారని ఇది ఎంత కాలం భరించాలని ఆయన ప్రశ్నించారు. నేటి యాజమాన్యం ఉద్యోగుల జీతాలను చివరి ప్రాధాన్యతగా తీసుకోవడం అత్యంత దుర్మార్గమని ఆయన అన్నారు. కేవలం 86 కోట్లు సమకూరటం లేదని యాజమాన్యం ఆడుతున్న నాటకాలను తక్షణం కట్టిపెట్టి సకాలంలో జీతాలు చెల్లించాలని ఆయన యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.
స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి యు రామస్వామి మాట్లాడుతూ ఉద్యోగుల జీతాలు నుండి పిఎఫ్, త్రిప్ట్, ఎల్ఐసి తదితర సంస్థలకు సకాలంలో చెల్లించకపోవడం అత్యంత దుర్మార్గమని ఆయన అన్నారు. ఉద్యోగుల సొమ్మును పెట్టుబడిగా వినియోగించుకోవడం చట్టరీత్యా నేరమని ఆయన వివరించారు. పిఎఫ్ కి 250 కోట్లు, త్రిప్ట్ కి 50 కోట్లు తక్షణమే వడ్డీతో సైతం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. యాజమాన్యం ఆదిశగా చర్యలు చేపట్టలి లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ఆయన హెచ్చరించారు.
స్టీల్ సిఐటియు అధ్యక్షులు వైటి దాస్ మాట్లాడుతూ చివరకు ఫ్యామిలీ బెనిఫిట్ కోసం పిఎఫ్, గ్రాట్యివిటీ ని యాజమాన్యం దగ్గర జమ చేసిన ఉద్యోగుల కుటుంబాలకు బేసిక్+డిఎ లు చెల్లించకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. స్టీల్ మంత్రి గారు రాక ముందు 13 వేల టన్నులు జరుగుతుండగా నేడు అది 11 వేల టన్నులకు తగ్గించబడిందని ఆయన వివరించారు. స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడిపేందుకు అవసరమైన చర్యలను తక్షణం చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
దీనికి స్పందించిన ఈ డి (వర్క్స్) సొప్తి మాట్లాడుతూ ఈ సమస్యను ఉన్నత యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్తానని ఆయన అన్నారు.
ఈ ధర్నా లో స్టీల్ సిఐటియు ప్రతినిధులు పి శ్రీనివాసరాజు, బి అప్పారావు, కె గంగాధర్, టి వి కె రాజు, మరిడయ్య, నీలకంఠం, పుల్లారావు, మహేష్, శ్రీనివాస్, రాజా, అరుణ్ కుమార్, పవన్, మొహిద్దిన్, శ్రీనివాస్ రెడ్డి, బి ఎన్ మధుసూదన్, కె ఆర్ కె రాజు, డి ఎస్ ఆర్ సి మూర్తి, రమణమూర్తి తదితరులతోపాటు వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.