దేశ రాజధానిలో బాంబు కలకలం
ధౌలా కువాన్ ఆర్మీ స్కూల్, లోధి రోడ్డు ఎయిర్ ఫోర్స్ స్కూళ్లకు ఈ-మెయిల్స్
దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు మరోసారి కలకలం రేపుతున్నాయి. గతంలో అనేకసార్లు పాఠశాలలకు వచ్చిన బెదిరింపులు నకిలీవని తేలినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అధికారులు ఏ చిన్న అంశాన్ని వదిలిపెట్టడం లేదు.
విశ్వంభర, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు మరోసారి కలకలం రేపుతున్నాయి. గతంలో అనేకసార్లు పాఠశాలలకు వచ్చిన బెదిరింపులు నకిలీవని తేలినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అధికారులు ఏ చిన్న అంశాన్ని వదిలిపెట్టడం లేదు. తాజాగా ధౌలా కువాన్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్, లోధి రోడ్డులోని ఎయిర్ ఫోర్స్ బాల్ భారతి స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడంతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందిన వెంటనే స్పందించిన పాఠశాల యాజమాన్యాలు విద్యార్థులను అత్యవసరంగా ఇళ్లకు పంపించాయి. ఢిల్లీ ఫైర్ సర్వీస్, స్థానిక పోలీసులు, బాంబు డిస్పోజల్ యూనిట్లు రంగంలోకి దిగి పాఠశాల ప్రాంగణాలను క్షుణ్ణంగా గాలించాయి. క్లాస్ రూమ్‌ల నుండి ఆటస్థలాల వరకు అణువణువూ తనిఖీలు చేపట్టడంతో అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.
ఉగ్ర ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాలు
మరోవైపు నిఘా వర్గాలు అందజేసిన తాజా సమాచారం భద్రతా దళాలను మరింత అప్రమత్తం చేసింది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ఢిల్లీలో దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా చారిత్రక కట్టడమైన ఎర్రకోట, అత్యంత రద్దీగా ఉండే చాందినీ చౌక్ ప్రాంతం, పరిసరాల్లోని ముఖ్యమైన మతపరమైన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. గతేడాది ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనను దృష్టిలో ఉంచుకుని, ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అనుమానిత వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచుతూ, వ్యూహాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు.
దర్యాప్తు ముమ్మరం చేసిన భద్రతా ఏజెన్సీలు
ఈ బెదిరింపు ఈ-మెయిల్స్ మూలాలను కనుగొనేందుకు సైబర్ క్రైమ్ విభాగాన్ని రంగంలోకి దించారు. ఈ మెయిల్స్ ఎక్కడి నుండి పంపబడ్డాయి, దీని వెనుక ఏవైనా ఉగ్రవాద సంస్థల హస్తం ఉందా లేక ఎవరైనా ఆకతాయిలు కావాలని చేస్తున్నారా అనే కోణంలో విచారణ సాగుతోంది. పాఠశాలల పరిసరాల్లో భద్రతను పటిష్టం చేయడంతో పాటు, మెట్రో స్టేషన్లు, బస్టాండ్లు, బహిరంగ ప్రదేశాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు కోరుతున్నారు. రాజధానిలో భద్రతా పరిస్థితులను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.



