డిజిటల్ అరెస్ట్ భయం… వృద్ధ దంపతులకు రూ.14.85 కోట్ల నష్టం..!!

డిజిటల్ అరెస్ట్ భయం… వృద్ధ దంపతులకు రూ.14.85 కోట్ల నష్టం..!!

విశ్వంభర తెలంగాణ, బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో సంచలనంగా మారిన ఒక భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. 

విశ్వంభర తెలంగాణ, బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో సంచలనంగా మారిన ఒక భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. పోలీస్‌, టెలికాం, న్యాయ వ్యవస్థ అధికారులుగా నటించిన సైబర్ నేరగాళ్లు, ‘డిజిటల్ అరెస్ట్’ అనే భయాన్ని సృష్టించి ఓ ఎన్‌ఆర్‌ఐ వృద్ధ డాక్టర్ దంపతుల నుంచి ఏకంగా రూ.14.85 కోట్లను దోచుకున్నారు. దాదాపు 17 రోజుల పాటు వారిని మానసికంగా వేధిస్తూ, ఇంట్లోనే బంధించినట్టుగా పరిస్థితులు సృష్టించి ఈ దారుణానికి పాల్పడ్డారు.

ఢిల్లీ గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో నివసిస్తున్న డాక్టర్ ఓం తనేజా, డాక్టర్ ఇందిరా తనేజా దంపతులు ఈ మోసానికి బలయ్యారు. వీరిద్దరూ ఐక్యరాజ్యసమితిలో దాదాపు 48 సంవత్సరాల పాటు సేవలందించి, 2015లో పదవీ విరమణ అనంతరం భారత్‌కు వచ్చి స్థిరపడ్డారు. గత ఏడాది డిసెంబర్ 24న వారికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తాము టెలికాం శాఖ, పోలీస్ విభాగానికి చెందిన అధికారులమని పరిచయం చేసుకున్న ఆ వ్యక్తులు, తమపై మనీ లాండరింగ్ కేసులు నమోదయ్యాయని, అరెస్ట్ వారెంట్లు కూడా జారీ అయ్యాయని బెదిరించారు.

Read More అస్సాం ప్రగతి పథంలో మరో మైలురాయి

ఈ హెచ్చరికలతో తీవ్ర భయాందోళనకు గురైన వృద్ధ దంపతులను, సైబర్ కేటుగాళ్లు ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో పూర్తిగా మానసికంగా నియంత్రించారు. డిసెంబర్ 24 నుంచి జనవరి 10 వరకు, అంటే సుమారు 17 రోజుల పాటు వీడియో కాల్స్ ద్వారా వారిని నిరంతరం నిఘాలో ఉంచారు. ఆర్‌బీఐ, సుప్రీం కోర్టు అధికారులుగా నటిస్తూ నకిలీ నోటీసులు, పత్రాలను చూపించి మరింత భయపెట్టారు. డబ్బు చెల్లిస్తే కేసుల నుంచి విముక్తి కల్పిస్తామని నమ్మించారు.

ఈ క్రమంలో డాక్టర్ ఇందిరా తనేజాను బ్యాంకులకు పంపించి, విడతల వారీగా ఎనిమిది వేర్వేరు బ్యాంక్ ఖాతాలకు భారీ మొత్తాలను బదిలీ చేయించారు. ఇలా మొత్తం రూ.14.85 కోట్లను సైబర్ నేరగాళ్లు తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. చివరకు జనవరి 10న “ఆర్‌బీఐ ఆదేశాల ప్రకారం మీ డబ్బులు తిరిగి వస్తాయి, సమీప పోలీస్ స్టేషన్‌కు వెళ్లండి” అని చెప్పి అకస్మాత్తుగా కాల్ కట్ చేశారు.

పోలీసు స్టేషన్‌కు వెళ్లిన తర్వాతే తాము ఘోరమైన మోసానికి గురయ్యామని వృద్ధ దంపతులు గ్రహించారు. వెంటనే ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ పోలీసులు ఈ-ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకొని స్పెషల్ సైబర్ యూనిట్ (IFSO)కు దర్యాప్తును అప్పగించారు.

పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తూ, ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో వచ్చే కాల్స్ పూర్తిగా మోసమేనని స్పష్టం చేశారు. ఎలాంటి అధికార సంస్థలు కూడా ఫోన్ లేదా వీడియో కాల్స్ ద్వారా అరెస్టులు, డబ్బు బదిలీలు కోరవని తెలిపారు. ఇలాంటి అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే స్పందించకుండా, సమీప పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ విభాగాన్ని సంప్రదించాలని సూచిస్తున్నారు.