రిపబ్లిక్ డే వేళ ఉగ్ర ముప్పు.. నిఘా వర్గాల హెచ్చరికలు

దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్

రిపబ్లిక్ డే వేళ ఉగ్ర ముప్పు.. నిఘా వర్గాల హెచ్చరికలు

దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలకు సిద్ధమవుతున్న తరుణంలో నిఘా వర్గాలు కీలక హెచ్చరికలు జారీ చేశాయి. జనవరి 26న ఢిల్లీ సహా దేశంలోని ప్రధాన నగరాలే లక్ష్యంగా ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందని ఐబీ నివేదిక వెల్లడించింది.
 

విశ్వంభర, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలకు సిద్ధమవుతున్న తరుణంలో నిఘా వర్గాలు కీలక హెచ్చరికలు జారీ చేశాయి. జనవరి 26న ఢిల్లీ సహా దేశంలోని ప్రధాన నగరాలే లక్ష్యంగా ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందని ఐబీ నివేదిక వెల్లడించింది. ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థలు, బంగ్లాదేశ్‌కు చెందిన భారత్ వ్యతిరేక శక్తులు ఈ కుట్రకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం అందింది. దేశ అంతర్గత భద్రతను దెబ్బతీసేందుకు ఉగ్ర హ్యాండ్లర్లు సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. నేరుగా రంగంలోకి దిగకుండా, స్థానిక గ్యాంగ్‌స్టర్లను పావులుగా వాడుకుంటున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.

హరియాణా, పంజాబ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈ ఉగ్ర నెట్‌వర్క్ వేగంగా విస్తరిస్తున్నట్లు సమాచారం. స్థానిక యువతను, నేరగాళ్లను రాడికల్ శక్తులుగా మార్చి దాడులకు పురమాయిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. గతేడాది ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనను దృష్టిలో ఉంచుకుని, ఈసారి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ సరిహద్దులతో పాటు రద్దీగా ఉండే ప్రాంతాల్లో నిఘా పెంచాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, కీలక ప్రభుత్వ కార్యాలయాల వద్ద అదనపు బలగాలను మోహరించారు. పరేడ్ జరిగే పరిసర ప్రాంతాల్లో డ్రోన్లపై నిషేధం విధించడంతో పాటు సీసీ టీవీ నిఘాను ముమ్మరం చేశారు.

Read More చిన్న‌స్వామి స్టేడియంలో మ‌ళ్లీ క్రికెట్ మ్యాచ్‌లు

అప్రమత్తంగా ఉండాలని సూచన
అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రిపబ్లిక్ డే వేడుకలు ప్రశాంతంగా జరిగేలా త్రివిధ దళాలు, పారామిలటరీ దళాలు, స్థానిక పోలీసులు సమన్వయంతో పనిచేస్తున్నారు.