గాంధీజీ లో ఘనంగా గణిత దినోత్సవ వేడుకలు.
విశ్వంభర, చండూర్:- భారతీయ గణిత శాస్త్ర మేధావి శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకొని చండూరు మున్సిపాలిటీలోని గాంధీజీ విద్యాసంస్థల్లో గణిత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు శ్రీనివాసా రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ గణితంలో చేసిన కృషి గురించి నేటి తరానికి అవగాహన కల్పించడమే కాకుండా మనదేశంలో గణితశాస్త్ర అధ్యయానికి అదనపు ప్రోత్సాహం అందించాలని సూచించారు. ప్రతి విద్యార్థి గణిత శాస్త్రంలోని ప్రతి విషయాన్ని సమగ్రంగా, విశ్లేషణాత్మకంగా గ్రహించి, సాధన చేసి, పట్టు సాధించి విజయవకాశాలను మెరుగుపరచుకొని, సమాజంలో అగ్రగామిగా కొనసాగాలని చెప్పారు. గణితం కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాదని, రోజువారి జీవితంలో దాని ప్రాముఖ్యతను, సృజనాత్మకతలను తెలియపరచాలన్నారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులు తయారుచేసిన వివిధ గణిత బోధన పరికరాలతో మేల నిర్వహించారు. విద్యార్థులు గణిత శాస్త్ర పాటలతో చేసిన డ్యాన్సులు అలరించాయి.ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యాసంస్థల ప్రిన్సిపల్స్ భార్గవ్, పులిపాటి రాధిక, కందుల కృష్ణయ్య, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.



