రేవ్ పార్టీ కేసులో సంచలన నిజాలు.. హేమపై పోలీసుల సీరియస్..!
బెంగళూరు రేవ్ పార్టీ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసుల విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం ఈ పార్టీలో 101 మంది పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు.
బెంగళూరు రేవ్ పార్టీ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసుల విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం ఈ పార్టీలో 101 మంది పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. 30 మంది యువతులు, 71 మంది పురుషులు ఉన్నారు. ఇప్పటికే బెంగళూరు పోలీస్ స్టేషన్‌కు మెడికల్ టీమ్స్ వెళ్లి అందరి దగ్గర బ్లడ్ శ్యాంపుల్స్ సేకరిస్తున్నాయి.
ఈ కేసులో నిర్వాహకుడు వాసుతో పాటు నలుగురు అరెస్టయ్యారు. నటి హేమ ప్రస్తుతం బెంగళూరు పీఎస్‌లోనే ఉన్నారు. అయితే ఉదయం హేమ తాను రేవు పార్టీలో లేనని హైదరాబాద్‌లోనే ఉన్నానంటూ ఓ వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె బెంగళూరులోనే ఉండి ఆ వీడియో షూట్ చేసిందని పోలీసులు ఫొటోలు విడుదల చేశారు. హేమ ప్రజలను తప్పుదోవ పట్టించిందని పోలీసులు స్పష్టం చేశారు.
ఈ విషయంపై పోలీసులు మరో కేసు నమోదు చేసినట్లు సమాచారం. మరోవైపు ఈ పార్టీలో నటుడు శ్రీకాంత్ కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన శ్రీకాంత్.. రేవ్ పార్టీలో పాల్గొనలేదని తనది అలాంటి సంస్కృతి కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను హైదరాబాద్‌లోనే తన ఇంట్లో ఉన్నానని తెలిపారు.