భూ భారతి స్కామ్‌లో 15 మంది అరెస్ట్
యాదగిరిగుట్ట కేంద్రంగా ఆన్‌లైన్ మోసాలు
రాష్ట్ర రెవెన్యూ శాఖలో సంచలనం సృష్టించిన 'భూ భారతి' కుంభకోణం కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల సరిహద్దుల్లో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో ఇప్పటివరకు 15 మందిని అరెస్ట్ చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రెవెన్యూ శాఖలో సంచలనం సృష్టించిన 'భూ భారతి' కుంభకోణం కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల సరిహద్దుల్లో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో ఇప్పటివరకు 15 మందిని అరెస్ట్ చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ కేసు వివరాలను వెల్లడించారు. భూ భారతి వెబ్‌సైట్‌లో ఉన్న కొన్ని సాంకేతిక లోపాలను నిందితులు తమకు అనుకూలంగా మార్చుకున్నారని చెప్పారు. తప్పుడు పద్ధతుల్లో లాగిన్ అయ్యి, ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలాన్లను పక్కదారి పట్టించి అక్రమ రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారని చెప్పారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు ఏకంగా రూ.3.90 కోట్ల గండి పడిందని సీపీ సన్ ప్రీత్ సింగ్ వివరించారు.
నిందితుల నుంచి భారీగా రికవరీ
పోలీసులు నిందితుల ఇళ్లపై దాడులు చేసి భారీ మొత్తంలో నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. నిందితుల నుంచి రూ. 63.19 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. రూ.కోటి విలువైన ఆస్తి పత్రాలు, నిందితుల బ్యాంకు ఖాతాల సీజ్ చేశామన్నారు. ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, కార్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
ఈ కేసులో బసవరాజు, జెల్లా అనే వ్యక్తులను ప్రధాన నిందితులుగా గుర్తించారు. ప్రస్తుతం మరో 9 మంది నిందితులు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. త్వరలోనే మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే ఇలాంటి సాంకేతిక నేరాల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని సన్ ప్రీత్ సింగ్ హెచ్చరించారు. ఈ కుంభకోణంలో ఇంకా ఎవరైనా ప్రభుత్వ అధికారులు లేదా కీలక వ్యక్తుల హస్తం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు.



