మహిళలపై హింస పెరుగుతోంది
విశ్వంభర, హైదరాబాదు : ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాల వల్ల మహిళలపై హింస పెరుగుతోందని చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్లు బి. జ్యోతి, వి. శ్రీదేవి పేర్కొన్నారు. మహిళల సమస్యలపై మహిళలు, ప్రజా సంఘాలు కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని తెలిపారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం హైదరాబాదు బషీర్బాగ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా మార్చి 10న ఉదయం 10.30 గంటలకు విశాఖపట్నం పౌర గ్రంథాలయంలో నిర్వహించనున్న మహిళా సభకు సంబంధించిన కరపత్రాలు, గోడపత్రికలను ఆవిష్కరించారు. మార్చి 8 అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినోత్సవం స్ఫూర్తితో ఈ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బాలికా విద్య అభివృద్ధికి కృషి చేసిన సావిత్రిబాయి పూలే స్ఫూర్తిని స్మరించుకుంటూ మహిళల హక్కులు, సమానత్వం వంటి అంశాలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. నాలుగు లేబర్ కోడ్ ల అమలుతో కార్మికుల ఉద్యోగ భద్రత తగ్గుతోందని, మహిళా కార్మికులు మరింత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. మద్యం, మత్తు పదార్థాల విస్తరణ యువతపై ప్రతికూల ప్రభావం చూపుతూ సమాజంలో హింసాత్మక వాతావరణాన్ని పెంచుతోందని అన్నారు. ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చడం, యువతకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడం, మహిళలపై నేరాలను అరికట్టే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సి. అలివేలి, ఎ. అరుణకుమారి, గిరిజ పుదేమం, సత్య తదితరులు పాల్గొన్నారు.



