నిధుల కోసమే ఢిల్లీ పర్యటనలు
నిర్మల్‌లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే తనకు ప్రత్యేక అభిమానం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. శుక్రవారం నిర్మల్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే తనకు ప్రత్యేక అభిమానం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. శుక్రవారం నిర్మల్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. జిల్లాకు యూనివర్సిటీ, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్, ఎయిర్‌పోర్టు వంటి మెగా ప్రాజెక్టులను ప్రకటించారు. గత పదేళ్ల పాలకుల నిర్లక్ష్యం వల్ల అన్యాయానికి గురైన ఈ పోరాట గడ్డను, పాలమూరు జిల్లాతో సమానంగా అభివృద్ధి చేసి తీరుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
సీఎం ప్రకటించిన కీలక హామీలు
ఎర్రబస్సు రావడమే కష్టమైన ప్రాంతానికి ఎయిర్‌పోర్టును తీసుకొచ్చి, స్వయంగా ప్రధాని మోదీతో ప్రారంభిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్‌కు ప్రత్యేక యూనివర్సిటీతో పాటు, నిర్మల్‌లో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ATC) ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. చనాకా-కొరాటా ప్రాజెక్టును సత్వరం పూర్తి చేస్తామని తెలిపారు. బడ్జెట్ సమావేశాలలోపే తుమ్మడిహట్టి ప్రాజెక్టు ప్రణాళికలు సిద్ధం చేసి, ప్రతి ఎకరానికి నీరందిస్తామని తెలిపారు. ఆదిలాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
కేసీఆర్ సలహాలు ఇవ్వాల్సింది పోయి విమర్శిస్తున్నారు
కేసీఆర్ 40 ఏళ్ల రాజకీయ అనుభవం అభివృద్ధికి ఉపయోగపడటం లేదని సీఎం ఎద్దేవా చేశారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూస్తే ప్రజలు రాజకీయ సమాధి కడతారని హెచ్చరించారు. ఒక్క పంచ్‌తో కేసీఆర్‌ను ప్రజలు ఫామ్‌హౌస్‌కు పరిమితం చేశారన్నారు. ఇక వారి గురించి మాట్లాడి సమయం వృధా చేయనని తెలిపారు. 2034 వరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.
అమలవుతున్న గ్యారెంటీలు
గత ప్రభుత్వం చేసిన అప్పుల చిక్కుముడులను విప్పుకుంటూనే ప్రజా సంక్షేమ పథకాలను పరుగులు తీయిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, సన్నవడ్లకు రూ.500 బోనస్, రైతులకు భరోసా పథకాలు అమలు చేస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. మేడారం జాతర కోసం అద్భుతమైన ఆలయాల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు.
ఢిల్లీ పర్యటనలపై క్లారిటీ
ప్రధాని మోదీని పదే పదే కలుస్తున్నారన్న విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తనకు వ్యక్తిగత ఎజెండా లేదని.. పైరవీలు చేయాల్సిన అవసరం అంతకన్నా లేదన్నారు. రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు రావాలంటే ప్రధానిని, కేంద్ర మంత్రులను కలవాల్సిందేనని తెలిపారు. అడగనిదే అమ్మ కూడా పెట్టదని.. అందుకే ప్రతిసారి వెళ్లి రాష్ట్ర పరిస్థితిని ప్రధానికి వివరిస్తున్నానని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అడగడం మర్చిపోయింది కాబట్టే రాష్ట్రానికి నష్టం జరిగిందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు కూడా కేవలం రాజకీయాలు చేయకుండా ఢిల్లీ నుంచి నిధులు తీసుకోవాలని హితవు పలికారు.
మున్సిపల్ ఎన్నికల నగారా
మున్సిపల్ ఎన్నికలపై రేవంత్ రెడ్డి స్పందించారు. డబ్బులకు ఆశపడి ఓటు వేస్తే ఐదేళ్లు బాధపడాల్సి వస్తుందన్నారు. అభివృద్ధి చేసే వారికే ఓటు వేయండి.. ప్రజా ప్రభుత్వంతో కలిసి నడిచే నాయకులనే ఎన్నుకోవాలని అని సీఎం ప్రజలకు పిలుపునిచ్చారు.



