సబ్సిడీ పై పశుగ్రాస విత్తనాలు సిద్ధం
- పశుపోషకులకు మంచి అవకాశం
- అసిస్టెంట్ డైరెక్టర్ డా.. పి పెంటయ్య
విశ్వంభర, కోదాడ: వేసవి వస్తుందంటేనే పశుపోషకుల గుండెల్లో భయం మొదలవుతుందని అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య చెప్పారు. కోదాడ పట్టణం ప్రాంతీయ పశువైద్యశాలలో సబ్సిడీ పై పశుగ్రాస విత్తనాల ఉపయోగం పై పశుపోషకులకు అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, భగ భగ మండే ఎండలతో పోటీగా మండే గడ్డి ధరలకు, గడ్డి కొనలేక, పశువుల్ని బైట తోలి మేపడానికి పచ్చిక లేక, ఎండ తాకిడి ఒక వైపు రోడ్డు ప్రమాదాలు, కరెంట్ తీగలు నీరు నిండిన బావులు ఒక వైపు పశువుల ప్రాణాలు తీయడానికి సిద్ధంగా ఉండడమే భయానికి కారణమని అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులను అధిగమించడానికి పంట కోయగానే భూమి వనరులు ఉన్న పశుపోషకులు గడ్డి జొన్న పెంచుకొని వేసవిలో గడ్డికొరత అధిగమించడానికి ప్రభుత్వం 75 శాతం సబ్సిడీతో పశుగ్రాస విత్తనాలను పశువైద్యశాలల్లో పంపిణీకి సిద్ధంగా ఉంచిందని అన్నారు. ప్రస్తుతం పంట కోతలు మొదలవుతున్నందున, వరి చేలు కోయగానే అదే తడిలో గడ్డి జొన్నలు చల్లుకునట్లయితే అదే తేమతో గడ్డి జొన్న మొలుస్తాయని అవసరాన్ని బట్టి 10 రోజులకి ఒకసారి నీటి తడి అందిస్తే 45 రోజుల్లో మొదటి కోత వస్తుందని అన్నారు. ఆ పై ప్రతీ పదిరోజులకు ఒక సారి నీరు పెడుతూ కొద్దిగా పశువుల ఎరువు వేసినచో 20 రోజులకి ఒక కోత చొప్పున ఎకరాకి 20 నుండి 25 టన్నుల మేలైన పచ్చి పశుగ్రాసం వస్తుందని అన్నారు. అన్ని కాలాలను తట్టుకొని పెరిగే ఈ గడ్డి జొన్న భూమి ఉన్న రైతులతో పాటు భూమిలేనివారు కౌలు భూమిలో కూడా వేసుకోవచ్చని గడ్డి కొనడం కంటే పెంచిన ఖర్చు చాలా తక్కువని సూచించారు. పశువులు లేకుండా భూమి ఉండి నీటి వసతి ఉన్న రైతులు ఈ గడ్డిని పెంచి గడ్డి కత్తిరించే యంత్రం తో ముక్కలుగా పట్టి పాతిక కిలోల సంచుల్లో నింపి ఒక్క సంచి యాబది రూపాయలకు పశువుల రైతులకు విక్రయించుకోవచ్చు అన్నారు. అలా ఒక ఎకరం గడ్డితో తక్కువలో తక్కువ వేల రూపాయల ఆదాయం వస్తుందని అన్నారు. ఇక ఈ గడ్డి సంచులను పట్టణం లో లేదా గ్రామాల్లో ఒకటి రెండు పశువులు ఉన్నవారు రోజుకి ఒక బస్తా గడ్డి ఒక కిలో దాణా వేసుకుంటే నెలకి 2 వేల నుండి 2 వేల అయిదు వందలతో ఖర్చు తగ్గి పాలు పెరిగి మంచి లాభాలు పొందవచ్చు అన్నారు . ప్రత్యేకమైన పశుగ్రాస జొన్న గడ్డి పశువులకు కావలసిన శక్తి పీచు ఇతర మూలకాలు కలిగిన బలమైన పచ్చిమేత అని ఏపాటి కొద్దిగా సౌకర్యాలున్నా రైతులు ఆలస్యం చేయకుండా గడ్డిజొన్న సాగుచేసుకోవాలని అన్నారు. పశువుకి ఆరోగ్యం, పాలదిగుబడి పుష్కలం, రైతుకేమో అదనపు ఆదాయం పశోషకులకేమో ఖర్చు తగ్గి లాభాలను పెంచే పచ్చి పశుగ్రాసాన్ని ప్రతి ఒక్కరూ వేసుకోవాలని సూచించారు. 5 కిలోల ప్యాకింగ్ తో ఉన్న గడ్డి జొన్నలు అసలు ధర కాగా.435 రూపాయలు కాగా సబ్సిడీ పోను.109 రూపాయలకే అందివ్వడం జరిగిందని చెబుతూ గడ్ఫిజొన్నలకు వచ్చే రైతులు ఆధార్ కార్డు , చరవాణి నెంబరు తీసుకు రావాలని, ఈరోజు వివరాలను అదే రోజు భారత్ పశుదాన్ అప్ లో అప్ లోడ్ చేయడం జరుగుతుందని, తద్వారా అంతర్జాలం ద్వారా సైతం ఈ వేసవిలో ఎంత గడ్డి అదనంగా పెంచారు ఎన్ని పశువులకు లబ్ధి చేకూరింది అన్న విషయాలు ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది అన్నారు. పశుపోషకుల అవగాహనా కార్యక్రమములో కోదాడ మండల పశువైద్యాధికారి డా బుక్యా మధు, సిబ్బంది రాజు, సాగర్, రాజేష్ వివిధ మండలాల పశుపోషకులు పాల్గొన్నారు.



