థియేటర్‌లో ఏసీ లేదు.. యాజమాన్యానికి ఫైన్!
థియేటర్‌లో ఓ వ్యక్తికి ఉక్కపోసింది. దీంతో యాజమాన్యం ఆయనకు టికెట్ డబ్బులు రీఫండ్ చేయడంతో పాటు.. మరో మూడు వేలు చేతులో పెట్టింది. బంపర్ ఆఫర్ లా అనిపిస్తుంది కదా? కాకపోతే పెద్ద కేసు అయిన తర్వాత థియేటర్ యాజమాన్యం కోర్టు ఆదేశాలతో ఈ చెల్లింపులు జరిపింది.
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ కు చెందిన నేరోళ్ల నిష్పర్ అనే వ్యక్తి గతేడాది ఏప్రిల్ 28న అబిడ్స్‌లోని ‘ముక్త ఏ2 సినిమాస్’ థియేటర్‌కు వెళ్లారు. అక్కడ ‘కిసీ కా భాయ్.. కిసీ కా జాన్’ సినిమా చూశాడు. తన బైక్ పార్కింగ్‌కు రూ.20 ఫీజు, సినిమా టికెట్‌కు రూ.150 కట్టారు. థియేటర్‌లో ఏసీలు ఉన్నా.. అవి పని చేయలేదు. ఇక అక్కడక్కడ ఉన్న ఫ్యాన్లతో గాలి అంతంతమాత్రంగానే వీసింది. దీంతో ఆయన తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఇంటర్వెల్ సమయంలో ఈ సమస్యను యాజమాన్యం దృష్టికి తీసుకొని వెళ్లాడు. కానీ.. వారిని నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. సమస్య పరిష్కరించకపోగా నేరోళ్ల నిష్పర్‌పై అక్కడి సిబ్బంది దుర్భాషలాడి దురుసుగా ప్రవర్తించారని బాధితుడు వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేశాడు.
గోల్డ్ క్లాస్ సీట్‌లోనూ ఏసీ ఏర్పాటు చేయలేదని కంప్లైంట్ చేశాడు. తెలంగాణ సినిమాస్ చట్టం- 1955 ప్రకారం రూ.110 ఉండాల్సిన టికెట్ ధరను రూ.150కు పెంచి అమ్ముతున్నారని ఆరోపించారు. దీంతో.. వినియోగదారుల కమిషన్ థియేటర్ యాజమాన్యానికి నోటీసులు పంపింది. కానీ.. ఫిర్యాదు దారుడి ఆరోపణల్లో నిజం లేదని వాదించింది. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత టికెట్ డబ్బు రీ ఫండ్ చేసి మూడువేలు చెతికి ఇవ్వాలని చెప్పింది. అంతేకాదు..కేసు ఖర్చులు కూడా చెల్లించాలని ప్రకటించింది.