మూఢనమ్మకాల నిర్మూలనకు కృషి
విశ్వంభర, ముషీరాబాదు : మూఢనమ్మకాల నిర్మూలనకు కృషి చేసిన వ్యక్తి కమలాకర్ అని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు డా. హిప్నో పద్మా కమలాకర్ అన్నారు. ముషీరాబాదులోని ఎస్సీ బాలికల వసతి గృహంలో శుక్రవారం ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, వనితా భారత లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డా. హిప్నో కమలాకర్ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. మూఢనమ్మకాలపై అవగాహన పెంచడంలో కమలాకర్ పాత్ర విశేషమని పేర్కొన్నారు. మూఢనమ్మకాలు తొలగితేనే సమాజ అభివృద్ధి సాధ్యమని ఆయన నమ్మకమని చెప్పారు. సైకాలజిస్టులకు వృత్తిపరమైన భద్రత, కౌన్సిల్ ఏర్పాటు కోసం చేసిన కృషి అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మూఢనమ్మకాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు, పుస్తకాలు, పోషకాహారం పంపిణీ చేశారు. జయశ్రీ మాట్లాడుతూ సామాజిక చైతన్యం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించిన వ్యక్తి కమలాకర్ అని తెలిపారు. హిప్నాటిజం, సైకాలజీ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించి మూఢనమ్మకాల నిర్మూలనకు కృషి చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జి. కృష్ణవేణి, హాస్టల్ హెడ్ సుకన్య తదితరులు పాల్గొన్నారు.



