బీరంగూడలో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం
విశ్వంభర, సంగారెడ్డి జిల్లా: అమీన్పూర్ మండలం బీరంగూడ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జునస్వామి కల్యాణాన్ని గురువారం పురోహితులు, అర్చకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద పండితులు, అర్చకుల మంత్రోచ్ఛరణాల మధ్య మధ్యాహ్నం 1.45 గంటలకు కల్యాణ మహోత్సవాన్ని జరిపించారు. ఆలయ ఈవో శశిధర్ గుప్తా , ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ దంపతులు పట్టు వస్త్రాలను, తలంబ్రాలను స్వామి వారికి సమర్పించారు. ఉదయం 11.30 నుంచి ప్రారంభమైన కల్యాణోత్సవ వేడుకలు, వేద పండితులు ప్రహల్లాదు వారి బృందం చే మధ్యాహ్నం వరకు కొనసాగించారు. అర్చకుల మంత్రోచ్ఛారణలతో మధ్య, మేళ తాళాలతో ఉత్సవ విగ్రహాలను వేదికకు తీసుకువచ్చి కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులు అక్షింతలు సమర్పించి ఆశీర్వచనాన్ని పొందారు. ఈ కళ్యాణ మహోత్సవంలో సంగారెడ్డి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధారాణి, ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.



