కేటీఆర్‌పై ఈసీ సీరియస్.. కేసు నమోదుకు రంగం సిద్దం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు నమోదుకు రంగం సిద్దమవుతోంది. తెలంగాణలో మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ రోజు కేటీఆర్.. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్టు ఈసీ గుర్తించింద. దీంతో.. జీహెచ్ఎంసీ కమిషనర్‌కి ఈసీ మోమూ జారీ చేసింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
ఈనెల 13న జరిగిన లోక్‌సభ ఎన్నికల పోలింగ్ రోజు మాజీ మంత్రి కేటీఆర్ నంది నగర్‌లో ఓటు వేశారు. ఆ తర్వాత బయటకు వచ్చి ఓటర్లను ప్రభావితం చేసేలా మీడియాతో మాట్లాడారు. తెలంగాణ తెచ్చిన పార్టీకి, తెలంగాణ సాధించిన నేతకు ఓటు వేశానని అన్నారు. అంతే కాదు.. ప్రజలంతా అలాగే ఓటు వేయాలని సూచించారు. కేటీఆర్ కామెంట్స్ ఓటర్లను ప్రభావితం చేసేలా ఉన్నాయని ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. పోలింగ్ స్టేషన్ దగ్గర ఎన్నికల ప్రచారం చేశారని విపక్షాలు విమర్శించాయి. కేటీఆర్ ఈసీ నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించారు. దీనిపై
కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్ ఈసీకి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేత ఫిర్యాదును పరిశీలించిన ఈసీ స్పందించింది. జీహెచ్ఎంసీ కమిషనర్‌కి ఈసీ మోమూ జారీ చేసింది.
ఎన్నికల రోజు చాలా మందిపై ఈసీ నిబంధలను ఉల్లంఘించారనే ఆరోపణలు వచ్చాయి. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత.. ముస్లిం మహిళల బుర్కా తీసి చూడటం వివాదాస్పదమైంది. అటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కూడా కోడ్ ను ఉల్లంఘించారని ఆరోపణలు వినిపించాయి. బీజేపీకి ఓటు వేయాలని పోలింగ్ స్టేషన్ దగ్గరే చెప్పారని వారిపై కూడా ఫిర్యాదులు వెళ్లాయి.