జీవో 65 ప్రకారం జీతాలు చెల్లించాలి

జీవో 65 ప్రకారం జీతాలు చెల్లించాలి

  •  సిఐటియు డిమాండ్

విశ్వంభర,  సంగారెడ్డి జిల్లా : ఇంద్రేశం మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 65 ప్రకారం రూ.16,600 జీతాలు చెల్లించాలని సిఐటియు సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు బి. నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. గురువారం ఇంద్రేశం మున్సిపల్ కమిషనర్‌కు సిఐటియు ఆధ్వర్యంలో మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఇంద్రేశం మున్సిపాలిటీ ఏర్పడి దాదాపు పది నెలలు గడిచినా, జీవో ప్రకారం కార్మికులకు జీతాలు చెల్లించడం లేదని ఆరోపించారు.ప్రస్తుతం గ్రామపంచాయతీ కాలంలో ఉన్న వేతనాలనే కొనసాగిస్తూ కార్మికులను నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. నెలకు కేవలం రూ.9,500తోనే కార్మికులు కుటుంబాలను పోషించుకోవాల్సి వస్తోందని అన్నారు. అంతేకాకుండా, ఈ వేతనాలు కూడా ప్రతి నెల 10వ తేదీ లోపు చెల్లించకుండా ఆలస్యం చేస్తున్నారని విమర్శించారు.ప్రతి నెల 6వ తేదీలోపు జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, అలాగే కార్మికులకు సంక్షేమ పథకాలు, భద్రతా సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. గుర్తింపు కార్డులు, సబ్బులు, నూనెలు వంటి ప్రాథమిక సౌకర్యాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు.అదేవిధంగా, బచ్చు గూడెం వార్డు పరిధిలో అర్జున్, చిన్న కంజర్ల వార్డు పరిధిలో ఖదీర్ అనే కార్మికులు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందినప్పటికీ, వారికి రావలసిన బీమా నగదు ఇప్పటివరకు చెల్లించలేదని ప్రశ్నించారు. మున్సిపల్ కార్మికులు మరణించిన సందర్భంలో వారి కుటుంబాలకు రూ.30 వేల ఆర్థిక సహాయం అందించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.ఇంద్రేశం మున్సిపాలిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, కార్మికుల సమస్యలను పట్టించుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఇంద్రేశం కమిటీ అధ్యక్షులు పోచయ్యతో పాటు మల్లేశం, నర్సింలు, శ్రీనివాస్, సుధాకర్, ఆంజనేయులు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags: