ప్రతి చిన్నారి రక్షణకు కృషి చేయాలి
విశ్వంభర, బాగ్ లింగంపల్లి: ప్రతి చిన్నారి రక్షణ, గౌరవం, సాధికారత పొందేలా సమాజం మొత్తం కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని రెయిన్బో హోమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కొనికేపూడి అనురాధ పేర్కొన్నారు. అంతర్జాతీయ వీధి బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాదు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రెయిన్‌బో సంస్థ ఆధ్వర్యంలో వీధి బాలలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా “రక్షించండి, శిక్షించకండి” పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిరాధరణకు గురవుతున్న చిన్నారులకు భద్రతతో పాటు సంరక్షణ, ప్రేమ, సరైన మార్గదర్శనం అందించాల్సిన అవసరం ఉందన్నారు. వీధి బాలలకు న్యాయం అందించేందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. డిస్ట్రిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, అనాధ పిల్లలను గుర్తించి వారికి తక్షణ సహాయం, రక్షణ, పునరావాసం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గర్ల్స్ హోమ్స్ సూపరింటెండెంట్ మైథిలీ, చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ సభ్యులు ప్రమోద, సామాజికవేత్త అందె వెంకటేశ్వర్లు, అంబికా, అశ్రిత తదితరులు పాల్గొన్నారు.



