లెబనాన్‌పై ఇజ్రాయిల్ దాడి సరికాదు
విశ్వంభర, ముషీరాబాదు : లెబనాన్‌పై ఇజ్రాయిల్ దాడి సరికాదని సిపిఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ అన్నారు. హైదరాబాదు ముషీరాబాదు నియోజక వర్గంలోని మేఫీల్ హోటల్ నుంచి షాప్ టు షాప్ ప్రచారం నిర్వహిస్తూ సిపిఐ హైదరాబాద్ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో విరాళాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అమెరికా ప్రపంచ దేశాలపై ఆధిపత్యం సాధించేందుకు యుద్ధాలను ప్రోత్సహిస్తున్నదని విమర్శించారు. కాల్పుల విరమణ ప్రకటిస్తూనే ఇరాన్‌పై ఆర్థిక ఆంక్షలు విధించడం, ఇజ్రాయిల్ ద్వారా లెబనాన్ వంటి దేశాలపై దాడులకు ప్రోత్సాహం ఇవ్వడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నదన్నారు. ప్రజలు యుద్ధాలకు వ్యతిరేకంగా శాంతి పరిరక్షణ కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి స్టాలిన్, సహాయ కార్యదర్శి కమతం యాదగిరి, జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రమోహన్ గౌడ్, నేర్లకంటి శ్రీకాంత్, చెట్టు కింది శ్రీనివాస్, సురేందర్, నాయకులు శ్రీమాన్, చైతన్య, అనిల్ కుమార్, సుశాంత్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.



