చెర్విత కేసును ఛేదించిన పోలీసులు
- వివరాలు వెల్లడించిన సీపీ రష్మీ పెరుమాళ్
- సీఐ, ఎస్ఐ, కానిస్టేబుళ్ల కు అభినందన
విశ్వంభర, సిద్దిపేట: సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన ఓ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి దొంగతనాలకు అలవాటుపడ్డాడు. ముగ్గురు స్నేహితులు, మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి దొంగతనాలు చేస్తూ జైలు పాలయ్యాడు. సీపీ రష్మీ పెరుమాళ్ కేసు వివరాలను రూరల్ సీఐ శ్రీను, ఏసీపీ రవీందర్ రెడ్డిలతో కలిసి గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు. పెద్దపెల్లి జిల్లా బెల్లంపల్లికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి నరేంద్రుల శ్రీకాంత్ రామగుండం ఐఓసీలో సెక్యురిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడిన శ్రీకాంత్ అధిక డబ్బులు సంపాదించాలనే ఆశతో దొంగతనం చేయాలని ప్లాన్ వేశాడు. ఈమేరకు హైదరాబాద్‌లో ఉంటున్న రామగుండానికి చెందిన తన స్నేహితులు రాకేశ్, శ్యామ్, గోదావరిఖనికి చెందిన చంద్రశేఖర్‌లకు విషయం చెప్పాడు. దోపిడీ దొంగతనాలకు పాల్పడుతున్న గణేశ్, ప్రేమ్‌చంద్, పవన్‌లను కలిసి ముఠాను ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో సిద్దిపేట ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి సహకారంతో పట్టణ శివారు చెర్విత మెడోస్‌లోని ఓ ఇంట్లో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు. గతనెల ఏప్రిల్ 4తేదీన చంద్రశేఖర్ అనే డాక్టర్ ఇంట్లోకి కల్లూరి గణేష్, ప్రేమ్‌చంద్, పవన్ ప్రవేశించి కత్తులతో ఇద్దరు మహిళలు, ఇద్దరు పిల్లల చేతులు కట్టేసి భయబ్రాంతులకు గురిచేశారు. బంగారు పుస్తెల తాడు, చైన్, కమ్మలు, లక్ష రూపాయల నగదు, సెల్ ఫోన్లు దొంగలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు 10టీమ్ లను ఏర్పాటుచేసి 72గంటల్లోపు కేసు ఛేదించారు. దొంగతనం కేసులో కీలక నిందితులు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి శ్రీకాంత్, రాజేశ్, శ్యామ్, చంద్రశేఖర్, గణేశ్, ప్రేమ్ చంద్, పవన్ లను, దొంగలించిన సొత్తును తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చిన ప్రకాష్, వినయ్‌లను అరెస్టు చేశారు. వీరి వద్ద 4.6 తులాల బంగారం, కారు, బైక్, 10 సెల్ ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. సిద్దిపేటకు చెందిన మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. భద్రాద్రి, ములుగు జిల్లాల్లోని పోలీస్ స్టేషన్ల పరిధిలో గణేష్‌పై 13 కేసులు, పవన్ పై 10 కేసులు ఉన్నాయి. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన ఏసీపీ రవీందర్, సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, రూరల్ ఎస్ఐ రాజేశ్, చిన్నకోడూరు ఎస్ఐ చంద్రమోహన్, రాజగోపాల్‌పేట ఎస్ఐ వివేక్, బెజ్జంకి ఎస్ఐ సౌజన్య, పోలీసు సిబ్బంది రాజు, సుభాష్, యాదగిరి, స్వామిలను సీపీ పెరుమాళ్ అభినందించారు.



