హెచ్‌ఐవీ పై అవగాహన కార్యక్రమాలు
- మంత్రి దామోదర్ రాజనర్సింహ
విశ్వంభర, హైదరాబాదు : రాష్ట్రవ్యాప్తంగా హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమాలు, వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. హైదరాబాదు కేబుల్ బ్రిడ్జ్‌పై నిర్వహించిన మానవహారం కార్యక్రమంలో పాల్గొని అవగాహన పెంపు అవసరాన్ని వివరించారు. హెచ్‌ఐవీ సాధారణ పరిచయాలతో వ్యాపించదని, అపోహలు, వివక్షకు తావులేకుండా బాధితులకు గౌరవం ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం ఉచిత పరీక్షలు, చికిత్స అందిస్తూ రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్, ART కేంద్రాల ద్వారా లక్షలాది మందికి సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా జైళ్లలో కూడా హెచ్‌ఐవీ, టీబీ స్క్రీనింగ్ శిబిరాలు ఏర్పాటు చేసి, చంచల్‌గూడ జైలులో మూడు రోజుల వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఖైదీల ఆరోగ్య సంరక్షణకు ప్రతి మూడు నెలలకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కొండాపూర్‌లో రూ.41 కోట్లతో వంద బెడ్ల క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణానికి ఎమ్మెల్యే అరికపుడి గాంధీతో కలిసి శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో ట్రామా కేర్ సేవలను బలోపేతం చేస్తూ 109 సెంటర్లు, 31 క్రిటికల్ కేర్ బ్లాకులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం కొండాపూర్ ఆస్పత్రి, డయాగ్నస్టిక్స్ హబ్‌ను సందర్శించి వైద్య సేవలపై రోగులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.



