వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి 

వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి 

  •  జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

విశ్వంభర,  మహబూబాబాద్: గురువారం జిల్లా కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, మిషన్ భగీరథ ఇంట్రా, గ్రిడ్, పంచాయతీ అధికారులతో కలిసి జిల్లాలో తాగునీటి సరఫరాపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టాలని  కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 1 నుండి స్పెషల్ డ్రైవ్ చేసిన దానిలో సమస్యలను పరిశీలించి పరిష్కరించాలని అన్నారు.  నీటి సరఫరా సమస్య ఉన్న గ్రామాలను ముందస్తుగా గుర్తించి ప్రణాళిక బద్దంగా మిషన్ భగీరథ నీరు క్రమం తప్పకుండా సరఫరా అయ్యేలా చూడాలని ఆదేశించారు. అలాగే గత సంవత్సరం నీటి ఎద్దడిని ఎదుర్కొన్న గ్రామాలలో సమస్య పునరావృతం కాకుండా చూడాలని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. గ్రామాలలో, హ్యాబిటేషన్ లలో  సరఫరా చేసేటువంటి నీరు నాణ్యతను పరిశీలించాలని అన్నారు. యాక్షన్ ప్లాన్ తయారు చేసి, గ్రామాల  వారీగా ఏప్రిల్ 23 తరువాత ప్రతి పాఠశాలలోని నీటి ట్యాoకులను శుభ్రపరచాలని అన్నారు. అదేవిధంగా పాఠశాలల్లో పైప్ లైన్ లీకేజీ ఏమన్నా ఉంటే వాటిని సరి చేయాలని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జిల్లాలో 4205 ఇందిరమ్మ ఇండ్లకు గాను సుమారు 795 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, గ్రామాలలో, మున్సిపల్ ప్రాంతాల్లో  పూర్తి కాని ఇండ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసే విధంగా అధికారులు ప్రత్యేక శ్రద్ద వహించాలని అన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఫీల్డ్ విసిట్ చేసి లబ్దిదారులతో మాట్లాడాలని మార్కింగ్, బేస్ మెంట్ లెవల్, స్లాబ్ లెవల్ నిర్మాణాల్లో ఉన్న ఇళ్లను త్వరగా పూర్తి చేయించాలని, ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు సాంక్షన్ అయి నిర్మాణానికి ఆసక్తి లేని వారి పేర్లలో వేరే లబ్ధిదారులను చేర్చే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. ఏ గ్రామంలోనైతే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొరకు లబ్ధిదారుల ఎంపికకు ఆ గ్రామ కమిటీ ఆసక్తి గా లేకపోతే కొత్త కమిటీ ప్రతిపాదనలకు చర్యలు తీసుకోవాలని అన్నారు.  ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల వద్ద ఉద్యోగులు ఏ విషయంలో నైనా డబ్బులు వసూళ్లకు పాల్పడినట్లు తమ దృష్టికి వస్తే క్షమించేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ గ్రిడ్, ఇంట్రా అధికారులు కృష్ణారెడ్డి,, ఎం.పి.డి.ఓ లు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

Tags: