ఇష్టారాజ్యంగా ప్రభుత్వ భూముల కబ్జా
- ఎంపీ రఘునందన్ రావు
విశ్వంభర, పటాన్‌చెరు: గడిచిన పదేళ్ల బిఆర్ఎస్ పాలనలోనూ, ప్రస్తుత రెండేళ్ల కాంగ్రెస్ పాలనలోనూ కొందరు నాయకులు ఇష్టారాజ్యంగా ప్రభుత్వ భూములను కబ్జా చేసి దోచుకుంటున్నారని మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు విమర్శించారు. గురువారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పట్టణ కేంద్రంలో జాతీయ రహదారి విస్తరణ పనుల సాకుతో జరుగుతున్న భూకబ్జాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, పటాన్‌చెరులోని సర్వే నంబర్ 428లో సుమారు 2 ఎకరాల 18 గుంటల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. జాతీయ రహదారుల విస్తరణ అనేది కేంద్ర ప్రభుత్వం కేవలం ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన పనులని, ఈ అభివృద్ధి పనులకు, కబ్జాదారులకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తరగతి గదులను రాత్రికి రాత్రి కూలగొట్టడం దుర్మార్గమని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రహదారి విస్తరణ పాఠశాల కాంపౌండ్ వాల్ బయట జరగాల్సి ఉండగా, హద్దులు దాటి పాఠశాల గదులను ఎందుకు కూల్చివేశారని ఆయన అధికారులను ప్రశ్నించారు."ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. విద్యా మందిరాలను కూల్చివేస్తుంటే చూస్తూ ఊరుకోం. దీని వెనుక ఉన్న ఆంతర్యమేమిటో బయటపడాలి."పాఠశాల గదులను కూల్చిన మిషనరీ యజమానులపై, కాంట్రాక్టర్లపై మరియు ఇందుకు బాధ్యులైన వారిపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. జిల్లా కలెక్టర్ మరియు ఉన్నతాధికారులు ఈ ఘటనపై తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలనీ విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా రక్షణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



