నూతన కాలనీలకు మంచి నీరు అందించండి
- జలమండలి ఎండి అశోక్ రెడ్డిని కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్
విశ్వంభర, సంగారెడ్డి : పటాన్చెరు నియోజకవర్గంలోని జలమండలి పరిధిలోగల నూతన కాలనీలకు సైతం రక్షిత మంచినీరు అందించేందుకు నిధులు కేటాయించాలని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి జలమండలి ఎండి అశోక్ రెడ్డిని కోరారు. గురువారం హైదరాబాద్ లోని జలమండలి కార్యాలయంలో ఎండి అశోక్ రెడ్డి ని కలిసి వివిధ అంశాలపై చర్చించారు. ప్రధానంగా అమీన్పూర్ డివిజన్ పరిధిలోని కిష్టారెడ్డిపేట గ్రామం, రాజరాజేశ్వరి కాలనీ ఫేజ్ 2, సృజన లక్ష్మీ కాలనీ ఫేజ్ 4, టైలర్స్ కాలనీ, లింగమయ్య కాలనీ, కె ఎస్ ఆర్ కాలనీలలో మంచినీటి సరఫరా లేకపోవడంతో ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుత వేసవి కాలంలో ప్రతి రోజు ట్యాంకర్లను ఆశ్రయించాల్సి వస్తుందని తెలిపారు. పైన పేర్కొన్న కాలనీలలో నూతన పైపులైన్ల ఏర్పాటు కోసం ఇప్పటికే ప్రతిపాదనలు తయారు చేయడం జరిగిందని.. రెండు కోట్ల నిధులు మంజూరు చేస్తే నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు.ఇందుకు సానుకూలంగా స్పందించిన ఎండి అశోక్ రెడ్డి.. అతి త్వరలో నిధుల మంజూరుకు ఆదేశాలు జారీ చేస్తామని తెలిపినట్లు ఎమ్మెల్యే జిఎంఆర్ పేర్కొన్నారు.



