ప్రజావాణి ఫిర్యాదులపై అధికారుల నిర్లక్ష్యం వద్దు : కలెక్టర్ హెచ్చరిక
విశ్వంభర, సూర్యాపేట,: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా సత్వరమే పరిష్కరించాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హెచ్చరించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. రాష్ట్ర స్థాయి గ్రీవెన్స్‌లకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, వచ్చిన ప్రతి దరఖాస్తును సమయానికి పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 78 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. వాటిలో భూ సమస్యలకు సంబంధించినవి 33 ఉండగా, డీఆర్‌డీఏకు 6, డీపీఓకు 5, డీడబ్ల్యూఓకు 5, మిగిలిన 29 వివిధ శాఖలకు సంబంధించినవిగా ఉన్నాయని వివరించారు. అందిన దరఖాస్తులను శాఖల వారీగా పంపించి, తక్షణ పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ కే. సీతారామారావు, జిల్లా పరిషత్ సీఈఓ శిరీష, రెవెన్యూ డివిజన్ అధికారి వేణు మాధవరావు సహా ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.



