ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం: ఎస్పీ నరసింహ
విశ్వంభర, సూర్యాపేట:జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె. నరసింహ పిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు . జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా తక్షణ ఆదేశాలు జారీ చేసి, పిర్యాదుల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల సమస్యలపై వేగంగా చట్టపర చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్నా ఎటువంటి పైరవీలు లేకుండా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నేరుగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. చట్టబద్ధమైన విధానంలోనే ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని, శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలకు మరింత చేరువగా ఉండడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.



