భద్రాచలంలో ఉల్లాసంగా ఒలింపిక్ డే రన్ - క్రీడల ద్వారా యువతకు మేలైన భవిష్యత్తు – ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు

భద్రాచలంలో ఉల్లాసంగా ఒలింపిక్ డే రన్  - క్రీడల ద్వారా యువతకు మేలైన భవిష్యత్తు – ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు

విశ్వంభర, భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఒలింపిక్ డే సందర్భంగా నిర్వహిస్తున్న ఒలింపిక్ డే రన్ కార్యక్రమం ఉల్లాసంగా సాగింది. ఈ రన్ ఈ నెల 18న పాల్వంచలో ప్రారంభమై, నిన్న దమ్మపేట చేరుకుని, ఈరోజు ఉదయం 6:30 గంటలకు భద్రాచలం పట్టణంలో ఒలింపిక్ జ్యోతి చేరుకుంది.ఈ సందర్భంగా భద్రాచలం ఎమ్మెల్యే  తెల్ల వెంకటరావు జ్యోతిని స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ, “భద్రాచలంలో త్వరలో 400 మీటర్ల అథ్లెటిక్స్ ట్రాక్ నిర్మాణం చేపడతాము. ఇందుకోసం ఐదు ఎకరాల భూమిని సేకరిస్తాం. స్థానిక క్రీడాకారులకు శాస్త్రీయంగా శిక్షణ అందించేందుకు ఇది ఉపయోగపడుతుంది” అని తెలిపారు.ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ బి. రాహుల్, ఐఏఎస్  మాట్లాడుతూ, “గిరిజన క్రీడాకారులు భద్రాచలం పరిసర ప్రాంతాల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారు. వారికి అవసరమైన మద్దతు అందించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎదగే అవకాశాలు కల్పిస్తాము” అని స్పష్టంచేశారు.
భద్రాచలం ఏఎస్పీ విక్రమ్ కుమార్ సింగ్, ఐపీఎస్ మాట్లాడుతూ, “యువత గంజాయి వంటి చెడు అలవాట్లను వదిలి క్రీడల వైపు మొగ్గు చూపాలి. భద్రాచలాన్ని గంజాయి రహిత పట్టణంగా మార్చేందుకు క్రీడలే ఉత్తమ మార్గం” అని తెలిపారు.జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ జి. యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ, “క్రీడల అభివృద్ధికి తగిన మౌలిక వసతులు కల్పిస్తే, జిల్లాలో నుండి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు వెలుసుకొస్తారు” అని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ సెంటర్ నుండి ప్రారంభమైన ఒలింపిక్ డే రన్‌లో సుమారు 200 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. యువతలో క్రీడా స్పూర్తి నింపే ఈ రన్ జనాల్లో ఉత్సాహాన్ని కలిగించింది.ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ కే. మహిధర్, చీఫ్ పాట్రన్ నాగ సీతారాములు, వైస్ ప్రెసిడెంట్ వై. వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరీ పి. నాగేంద్రబాబు, భద్రాచలం కన్వీనర్ గిరి ప్రసాద్, జిల్లా టెన్నిస్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు దాట్ల రాజు, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ట్రెజరర్ కుంచాల రమేష్, ఉదయ్ కుమార్, జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి రామ్ రెడ్డి, పీడీలు శ్వేత దుర్గారావు, ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు.
 
 
 
 
 
 
 
 
 

Tags: