మాతృభాష గొప్పది: ప్రొ.బాలకృష్ణారెడ్డి
విశ్వంభర, బషీర్ బాగ్: ప్రపంచంలో ఎన్నో భాషలు ఉన్న వాటిలో మాతృభాష గొప్పదని తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి అన్నారు. శనివారం తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నాంపల్లి లోని ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో అంతర్జాతీయ భాష దినోత్సవం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సదస్సులో అయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. భాష అంటే కేవలం మాట్లాడుకునేదే కాదు, అది ఒక జాతి చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు, విలువలను ప్రతిబింబించే అద్దం లాంటిదని వివరించారు. తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని నాలుగు యూనివర్సిటీల నుండి నలుగురు తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల అధిపతులను లాంగ్వేజ్ ప్రొఫజెన్సీ ఎక్సలెన్స్ అవార్డులకు ఎంపిక చేసామని తెలిపారు. ప్రముఖ పర్యావరణవేత్త విద్యావేత్త లైన్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ మాతృభాష తల్లితో సమానమని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ అడ్మిషన్స్ జాయిన్ డైరెక్టర్ ప్రొఫెసర్ మహమ్మద్ అక్తర్ అలీ, ఉస్మానియా యూనివర్సిటీ రిసెర్స్ స్కాలర్ డాక్టర్ రవితేజ చౌహన్ తదితరులు ప్రసంగించారు.



