ఆర్డీవో ఆదేశాలతో ఇల్లు ఖాలీ - రోడ్డున పడిన కుటుంబం .
అవమానం తట్టుకోలేక కుమారుడి ఆత్మహత్యాయత్నం .
విశ్వంభర: మహబూబాబాద్ జిల్లా : జిల్లా కేంద్రంలోని హనుమంతుగడ్డ వీధిలో కుటుంబ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది . ఆర్డీవో ఆదేశాల మేరకు అధికారులు ఇంటిని ఖాళీ చేయించడంతో ఒక కుటుంబం రోడ్డుపై పడిన ఘటన చోటుచేసుకుంది . ఈ సంఘటనలో అవమానాన్ని తట్టుకోలేక యువకుడు ఆత్మహత్యాయత్నం చేయడం స్థానికంగా కలకలం రేపింది . పూర్తి వివరాల్లోకి వెళ్తే హనుమంతుగడ్డకు చెందిన అరేంపుల వీరమ్మ (70) భర్త , వెంకటయ్య (లేట్) , తన కోడలు అరేంపుల సంధ్యారాణి (36), భర్త రాధాకృష్ణ (లేట్) తనను పోషించడం లేదని ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫిర్యాదు మేరకు మహబూబాబాద్ ఆర్డీవో ఆదేశాలపై బుధవారం మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో మహబూబాబాద్ ఎమ్మార్వో, టౌన్ ఎస్‌ఐ మరియు సిబ్బంది కలిసి ఇంటిని ఖాళీ చేయించారు . ఈ ఇల్లు సంధ్యారాణి మామ అరేంపుల వెంకటయ్య పేరిట ఉండగా, సంధ్యారాణి తన పిల్లలతో అక్కడే నివాసం ఉంటోంది. అధికారుల చర్యతో ఇంట్లో ఉన్న సామాన్లను బయటకు తీసి రోడ్డుపై పడేయడంతో కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.ఈ సందర్భంగా సంధ్యారాణి మీడియాతో మాట్లాడుతూ తనకు ఆర్డీవో కార్యాలయం నుంచి నాలుగు సార్లు నోటీసులు వచ్చినట్లు తెలిపింది. తాను అత్తను పోషించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పినా, ఆమె తనతో ఉండనని తెలిపిందని పేర్కొంది. తన అత్తకు ప్రభుత్వం నుంచి నెలకు రూ.38,200 పెన్షన్ వస్తుందని, ఆస్తిని తన ముగ్గురు కుమార్తెలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించింది.ఇంటి సామాన్లు రోడ్డు పై పడేయడంతో కలిగిన అవమానాన్ని తట్టుకోలేక సంధ్యారాణి కుమారుడు అరేంపుల వీరశౌర్య (21) అందరూ చూస్తుండగానే విషం ( మందు) తాగారు .
నోటిలో నుంచి నురుగు రావడంతో గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు అతన్ని వెంటనే మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు . ఇది ఇలా ఉండగా ఇంటి ముందు టెంట్ వేసుకుని రోడ్డుపైనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని, తమకు న్యాయం చేయాలని సంధ్యారాణి మరియు ఆమె కుటుంబ సభ్యులు రోదిస్తూ అధికారులకు విజ్ఞప్తి చేశారు . ఈ ఘటనపై అధికారులు స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు .



