రాష్ట్రాన్ని తాకట్టుపెట్టేందుకు యత్నం.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రాన్ని తాకట్టుపెట్టేందుకు యత్నం.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

  • తెలంగాణలో బొగ్గు అమ్మకాలను బీఆర్ఎస్ వ్యతిరేకించింది
  • సింగరేణి సంస్థను ప్రైవేటుపరం చేయాలని కాంగ్రెస్ కుట్ర
  • అన్ని రంగాల్లో ప్రజలను ద్రోహం చేస్తున్న కాంగ్రెస్
  • సరైన సమయంలో ప్రజలు బుద్ధిచెప్పడం ఖాయం
  • మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు 

తెలంగాణ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేందుకు కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయని మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. ఆయన శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేందుకు కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. రేవంత్‌ అబద్ధాలు చూసి తన సమాధిలో గోబెల్స్‌ ఉలిక్కిపడ్డారని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో బొగ్గు బ్లాకుల అమ్మకాలను బీఆర్ఎస్ వ్యతిరేకించిందని గుర్తుచేశారు. 

మీ ప్రభుత్వం లాగా మా ప్రభుత్వం నుంచి ఎవరూ వేలంలో పాల్గొనలేదని తెలిపారు. అన్ని రంగాలకు ద్రోహం చేస్తున్న పార్టీలకు ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు. 60 ఏండ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకొని పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్న పార్టీ తమదన్నారు. గనుల వేలంలో పాల్గొన్న మిమ్మల్ని, మీ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని తెలంగాణ చరిత్ర క్షమించదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

Read More గణనాధుని నిమజ్జనంలో ఆలేరు MLA బీర్ల ఐలయ్య


బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తమ ప్రభుత్వం తెలంగాణలోని బొగ్గు గనుల అమ్మకాన్ని ఎల్లప్పుడూ వ్యతిరేకించిందన్నారు. అందుకే ప్రభుత్వం ఏ రోజూ వేలంలో పాల్గొనలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం నిస్సిగ్గుగా వేలంలో పాల్గొని తెలంగాణ ప్రయోజనాలను దెబ్బ కొడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో తెలంగాణ బొగ్గు గనులను వేలం వేసిందన్నారు. 

వేలంలో గనులను దక్కించుకున్న రెండు కంపెనీలు కేవలం బీఆర్ఎస్ పార్టీ సింగరేణి ప్రయోజనాల కోసం నిలబడడంతోనే మైనింగ్ ప్రారంభించలేదన్నారు. కేంద్రంలోని బీజేపీ గనులను కేటాయించినా, కేవలం రాష్ట్ర ప్రభుత్వ కఠిన వైఖరి, నిబద్ధత వల్లనే ఆ కంపెనీలు సింగరేణి బొగ్గును తవ్వలేకపోయాయని తెలిపారు.  ఆ పూర్తి క్రెడిట్ బీఆర్ఎస్‌కు దక్కుతుందన్నారు. ఇప్పటికే నదీ జలాల వాటాను వదులుకున్న కాంగ్రెస్ తీరును రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారని చెప్పారు. తాజాగా బీజేపీకి అందిస్తున్న సహకారంతో సింగరేణి సంస్థను ప్రైవేటుపరం చేయాలన్న కుట్ర అందరికీ తెలిసిపోయిందని వెల్లడించారు.