వాయుపుత్ర శతకం ఆవిష్కరణ
విశ్వంభర, చిక్కడపల్లి : ప్రముఖ జర్నలిస్ట్, హాస్యావధాని శంకర నారాయణ రచించిన వాయుపుత్ర శతకం ఆవిష్కరణ సభ నగరంలోని చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలోని కళా సుబ్బారావు కళా వేదికపై జరిగింది. గానసభ నిర్వహణలో భాషా సాంస్కృతిక సౌజన్యంతో కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా గానసభ అధ్యక్షుడు కళా జనార్థన మూర్తి పాల్గొని శతక సంపుటిని ఆవిష్కరించారు. శంకర నారాయణ శతక పద్య రచనలో విశారదుడని, ఆయన రాసిన 45 శతకాలలో 40 శతకాలు వివిధ దేవతలపై ఉండటం విశేషమని పేర్కొన్నారు. శతక సంపుటిని శ్రీరస్తు సాంస్కృతిక సంస్థ కార్యదర్శి, కవి కె.వి. రమణ రెడ్డికి లాంఛనంగా అంకితం చేశారు. ఈ సందర్భంగా రమణ రెడ్డి మాట్లాడుతూ తనను అంకితగ్రాహకుడిగా ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు. శంకర నారాయణ మాట్లాడుతూ తిప్పాయపాలెంలో వెలిసిన ఆంజనేయ స్వామి, అలాగే గానసభలో ఉన్న వాయుపుత్రుని విగ్రహం తన రచనకు స్పూర్తినిచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో గాయకుడు రామ కుమార్ పాల్గొన్నారు.



