రైల్వే నిర్వహణలో భద్రత పై సమీక్ష
విశ్వంభర, జిహెఎంసి: దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, వివిధ శాఖల ప్రధాన అధిపతులతో కలిసి, రైల్ నిలయంలో జోన్ వ్యాప్తంగా రైలు కార్యకలాపాల భద్రతపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో విజయవాడ , గుంతకల్లు , గుంటూరు , సికింద్రాబాద్ , హైదరాబాద్, నాందేడ్ డివిజనల్ రైల్వే మేనేజర్లు (డిఆర్‌ఎంలు) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. సంజయ్ కుమార్ శ్రీవాస్తవ రైళ్ల రాకపోకలు సజావుగా సాగేందుకు ట్రాక్‌ల నిర్వహణ, నిరంతర పర్యవేక్షణ ఆవశ్యకతపై ఈ సమీక్షా సమావేశంలో ముఖ్యంగా ప్రస్తావించారు. ఈ నెలలో అధికారులు, సూపర్‌వైజర్లు నిర్వహించిన భద్రతా తనిఖీలపై సమీక్షించారు. సమర్థవంతమైన ట్రాక్ పెట్రోలింగ్‌ను నిర్ధారించడానికి కీమెన్‌లు , పెట్రోల్‌మెన్‌ల కోసం జీపీఎస్ ట్రాకర్ల లభ్యతను కూడా ఆయన పరిశీలించారు. రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని స్టేషన్లలో, సెక్షన్లు,ట్రాక్లపై అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికారులు, సూపర్‌వైజర్లకు సూచించారు. జనరల్ మేనేజర్ భద్రతా పనులు చేపట్టేటప్పుడు పని ప్రదేశాలలో రక్షణపై నిరంతరం దృష్టి సారించడం, వివిధ విభాగాల మధ్య సమన్వయం ప్రాముఖ్యతను పునరుద్ఘాటించారు. అంతేకాకుండా ప్రైవేట్ సైడింగ్‌లు, గూడ్స్ షెడ్ల వద్ద సీసీటీవీ కెమెరాల ఏర్పాటుపై సమీక్షించారు. జనరల్ మేనేజర్ ఇంజనీరింగ్, సిగ్నల్, టెలికమ్యూనికేషన్స్, మెకానికల్, ఎలక్ట్రికల్ మొదలైన విభాగాలకు సంబంధించి జోన్ వ్యాప్తంగా నిర్వహిస్తున్న భద్రతా డ్రైవ్‌లను కూడా సమీక్షించారు.



