గుర్తుతెలియని వాహనం ఢీకొని తండ్రి కొడుకుల దుర్మరణం
విశ్వంభర, మహేశ్వరం : ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ దారుణ ఘటనలో తండ్రి, కుమారుడు ప్రాణాలు కోల్పోయారు. ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డుపై, రావిరాలలో వండర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సాహెబ్‌నగర్ వనస్థలిపురానికి చెందిన కొమ్మగోని ప్రశాంత్ గౌడ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ద్విచక్ర వాహనంపై సూర్యగిరి ఎల్లమ్మ ఆలయానికి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం వేగంగా వచ్చి వారి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రశాంత్ గౌడ్ (41) అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన కుమారుడు శ్రీథన్ (11) తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ప్రమాదంలో గాయపడిన భార్య వాణి (38), కుమార్తె శశిక (10)లను వెంటనే తుక్కుగూడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు, వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై ఆదిభట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.



