ఆస్తి పన్ను చెల్లింపు తగ్గింపును సద్వినియోగం చేసుకోండి
విశ్వంభర, మిర్యాలగూడ: మిర్యాలగూడ పురపాలక సంఘం పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లు, ట్రేడ్ లైసెన్సులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ కమిషనర్ ప్రజలకు కీలక సూచనలు జారీ చేశారు. నగర అభివృద్ధికి అవసరమైన ఆదాయ వనరులను బలోపేతం చేయడం అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ పట్టణంలోని వ్యాపారులు, ఆస్తి యజమానులను ఉద్దేశించి మాట్లాడుతూ, తమ బాధ్యతలను సమయానికి నిర్వర్తించాలని కోరారు. ట్రేడ్ లైసెన్సుల విషయమై, పట్టణంలోని అన్ని వ్యాపార సంస్థలు, వ్యాపారులు తమ ట్రేడ్ లైసెన్సుల పెండింగ్ బకాయిలను తక్షణమే చెల్లించి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి లైసెన్సులను తప్పనిసరిగా రెన్యువల్ చేసుకోవాలని స్పష్టంగా ఆదేశించారు. ట్రేడ్ లైసెన్సులు లేకుండా వ్యాపారం నిర్వహించడం చట్ట విరుద్ధమని, అటువంటి వ్యాపారాలపై కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. అలాగే, ఆస్తి పన్ను విషయంలో ప్రభుత్వం ప్రకటించిన 5% రిబేట్ అవకాశాన్ని వినియోగించుకొని, పట్టణంలోని అన్ని ఆస్తి యజమానులు తమ పన్ను బకాయిలను తక్షణమే చెల్లించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. మునిసిపల్ కార్యాలయానికి వచ్చి ఆస్తి పన్ను చెల్లిస్తున్న సీనియర్ సిటిజన్లకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మిర్యాలగూడ పట్టణ అభివృద్ధి మరియు మౌలిక వసతుల మెరుగుదలకు ప్రతి పౌరుడు సహకరించాలని, ట్రేడ్ లైసెన్సులు కలిగిన వారు లైసెన్సులను రీన్యువల్ చేసుకోవాలని, ఆస్తి యజమానులు 5% రిబేట్‌ను వినియోగించుకొని పన్నులు చెల్లించాలని కమిషనర్ గారు విజ్ఞప్తి చేశారు. పట్టణ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, అందరూ తమ బాధ్యతలను నిర్వర్తించాలని సూచించారు.



