కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లో కాల్పుల కలకలం
హైదరాబాద్‌లోని అత్యంత రద్దీగా ఉండే కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లో శనివారం ఉదయం కాల్పులు కలకలం రేపింది. ఎస్బీఐ ప్రధాన కార్యాలయం సమీపంలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లోని అత్యంత రద్దీగా ఉండే కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లో శనివారం ఉదయం కాల్పులు కలకలం రేపింది. ఎస్బీఐ ప్రధాన కార్యాలయం సమీపంలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. ఓ వ్యాపారిని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపి, ఆయన వద్ద ఉన్న రూ. 6 లక్షల నగదును ఎత్తుకెళ్లారు.
ఏం జరిగిందంటే?
నాంపల్లికి చెందిన వస్త్ర వ్యాపారి రిషద్ (కేరళ వాసి) శనివారం ఉదయం సుమారు 7 గంటల సమయంలో రూ. 6 లక్షల నగదును ఏటీఎంలో డిపాజిట్ చేసేందుకు కోఠి బ్యాంక్ స్ట్రీట్‌కు చేరుకున్నారు. అప్పటికే అక్కడ మాటు వేసిన ఇద్దరు దుండగులు బైకుపై వచ్చి అతడిని చుట్టుముట్టారు. నగదు బ్యాగును లాక్కునే క్రమంలో రిషద్ ప్రతిఘటించడంతో, దుండగులు తమ వద్ద ఉన్న నాటు తుపాకీతో రిషద్ కాలిపై కాల్పులు జరిపారు. తూటా తగలడంతో రిషద్ కుప్పకూలిపోగా, నిందితులు బ్యాగుతో సహా స్కూటీపై పరారయ్యారు. తీవ్ర రక్తస్రావమైన రిషద్‌ను స్థానికులు, పోలీసులు వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని, పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
క్లూస్ టీమ్స్ రంగ ప్రవేశం
ఘటనాస్థలిని ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి, అడిషనల్ డీసీపీ ఆనంద్ సందర్శించారు. క్లూస్ టీమ్స్ ఘటనాస్థలంలో బుల్లెట్ షెల్స్, ఇతర ఆధారాలను సేకరించాయి. సుల్తాన్ బజార్ పోలీసులు ఈ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దుండగులను వదిలే ప్రసక్తే లేదని డీసీపీ శిల్పవల్లి తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామని తెలిపారు. రద్దీగా ఉండే ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను త్వరలోనే పట్టుకుంటామని స్పష్టం చేశారు.



