మేడారం మహాజాతరకు సర్వం సిద్ధం..
మూడు కోట్ల మంది భక్తులే లక్ష్యం
తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర–2026కు రాష్ట్ర ప్రభుత్వం అపూర్వ ఏర్పాట్లు చేపట్టింది. సుమారు 3 కోట్ల మంది భక్తులు తరలివస్తారనే అంచనాతో 21 ప్రభుత్వ శాఖలను సమన్వయం చేస్తూ కనీవినీ ఎరుగని రీతిలో వసతులు కల్పిస్తోంది.
విశ్వంభర, తెలంగాణ, బ్యూరో: తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర–2026కు రాష్ట్ర ప్రభుత్వం అపూర్వ ఏర్పాట్లు చేపట్టింది. సుమారు 3 కోట్ల మంది భక్తులు తరలివస్తారనే అంచనాతో 21 ప్రభుత్వ శాఖలను సమన్వయం చేస్తూ కనీవినీ ఎరుగని రీతిలో వసతులు కల్పిస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంత్రులు, ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలోనే బస చేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జాతర నిర్వహణను క్రమబద్ధీకరించేందుకు మొత్తం ప్రాంతాన్ని 8 పరిపాలనా జోన్లుగా, 42 సెక్టార్లుగా విభజించారు. 42,027 మంది అధికారులు, సిబ్బందితో పాటు 2,000 మంది ఆదివాసీ యువ వాలంటీర్లు సేవలందించనున్నారు. నెట్‌వర్క్ అంతరాయం లేకుండా 27 శాశ్వత, 33 తాత్కాలిక టవర్లు, 450 VHF సెట్లను ఏర్పాటు చేశారు.
ట్రాఫిక్ కష్టాలకు చెక్...
భక్తుల రాకపోకల కోసం టీజీఆర్టీసీ భారీ ఆపరేషన్ చేపట్టింది. 4,000 బస్సుల ద్వారా 51,000 ట్రిప్పులు నడపనుంది. ఇందులో 10,441 మంది ఆర్టీసీ సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. 1,418 ఎకరాల్లో 42 పార్కింగ్ ప్రాంతాలను సిద్ధం చేశారు.
పారిశుధ్యం, ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత..
కోట్లాది మంది భక్తులు వచ్చే చోట పరిశుభ్రతకు పెద్దపీట వేశారు. 285 బ్లాకుల్లో 5,700 టాయిలెట్లు, అదనంగా మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు.5,000 మంది పారిశుధ్య కార్మికులు నిరంతరం పనిచేయనున్నారు. 5,192 మంది వైద్య సిబ్బంది, 30 అంబులెన్సులు, 40 బైక్ అంబులెన్సులు అందుబాటులో ఉండనున్నాయి. దీంతో పాటు 50 పడకల ప్రధాన ఆసుపత్రితో పాటు రోజూ 30 మెడికల్ క్యాంపులు నిర్వహించనున్నారు.
5,482 నల్లాలు, మిషన్ భగీరథ ద్వారా నీటిని సరఫరా చేయనున్నారు. 196 ట్రాన్స్‌ఫార్మర్లు, 28 డీజిల్ జనరేటర్లు (బ్యాకప్), 210 మంది గజ ఈతగాళ్లు, 100 SDRF బృందాలు, 15 వాహనాలు, 268 మంది ఫైర్ ఫైటర్లు, జంపన్నవాగు వద్ద 119 గదుల సౌకర్యం కల్పించనున్నారు.
మీడియా కోసం ప్రత్యేక ఏర్పాట్లు
దేశ విదేశాలకు జాతర విశేషాలను చేరవేసేందుకు అమ్మవార్ల గద్దెల పక్కనే ఉన్న టీటీడీ కళ్యాణ మండపంలో హైటెక్ మీడియా సెంటర్ ఏర్పాటు చేశారు. 100 Mbps ఇంటర్నెట్, 20 హై-కన్ఫిగరేషన్ కంప్యూటర్లు, జిరాక్స్, ఫ్యాక్స్ సదుపాయాలతో పాటు జర్నలిస్టులకు భోజన వసతి కల్పిస్తున్నారు.



