గాడిద గుడ్డు వర్సెస్ వంకాయ

గాడిద గుడ్డు వర్సెస్ వంకాయ

* తెలంగాణ పాలిటిక్స్‌ను షేక్ చేస్తున్న గుడ్డు, కాయ
* గాడిద గుడ్డును ఎత్తుకుని తిరుగుతున్న సీఎం రేవంత్ రెడ్డి
* వంకాయను పట్టుకుని తిరుగుతున్న బీజేపీ నాయకులు
* కొత్త రకం ప్రచారంతో దేశ రాజకీయాలను ఆకర్షించిన తెలంగాణ నేతలు

విశ్వంభర, హైదరాబాద్ :  రాష్ట్రంలో ప్రస్తుతం గాడిద గుడ్డు, వంకాయ పాలిటిక్స్ నడుస్తున్నాయి. గాడిద గుడ్డు కాంగ్రెస్ పార్టీది కాగా, వంకాయ బీజేపీది. ఈ రెండు లోక్ సభ ఎన్నికల్లో ప్రచార అస్త్రాలుగా ఎంట్రీ ఇచ్చాయి. ఒకరు గాడిద గుడ్డును చేతపట్టుకుని తిరుగుతుండగా.. మరొకరు వంకాయను భుజాన వేసుకుని తిరుగుతున్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. కానీ తెలంగాణలో ఆ విమర్శలు బూతులుగా మారాయి. నోటికి ఏమాట వస్తే అది మాట్లాడుతూ దిగజారిపోతున్నారు. విమర్శ అంటేనే బూతుగా మార్చారు. తాజాగా లోక్ సభ ఎన్నికల సందర్భంగా వ్యంగంగా సంభోదించే గాడిద గుడ్డు, వంకాయలను చేర్చి దేశ రాజకీయాల్లో కొత్త ఒరవడికి తెరలేపారు తెలంగాణ లీడర్స్. ఇచ్చిన హామీలు, నెరవేర్చని హామీలపై నీది గాడిద గుడ్డు, నాది వంకాయ అన్నట్లు ప్రచార అస్త్రాలను సంధిస్తున్నారు. ఇదంతా చోటామోట నాయకులు కాదు చేసేది.. ఏకంగా సీఎం, కేంద్రమంత్రులే భుజాన వేసుకుని బహిరంగ సభల్లో దుమ్మెత్తి పోసుకుంటూ ప్రజలను తమవైపు తిప్పుకుంటున్నారు. 

తెరలేపింది హస్తం పార్టీనే..
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డే అంటూ కాంగ్రెస్ ప్రచార అస్త్రాన్ని అందుకుని అందరికీ ఈజీగా రీచ్ అయ్యేలా ప్లాన్ చేసింది. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి సైతం బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు అంటూ ప్రత్యేకంగా తయారు చేసిన గుడ్డును బహిరంగ సభల్లో ప్రదర్శించడం సంచలనంగా మారింది. తెలంగాణ అడిగింది ఇవీ అంటూ ఓ ఫ్లెక్సీని తయారు చేసి దాని ముందు గాడిద గుడ్డును పెట్టి కేంద్రం ఇచ్చింది ఇదే అని ప్రదర్శించింది. తెలంగాణ అడిగిన వాటిల్లో.. ‘‘రూపాయి పంపిస్తే 43 పైసలు బిచ్చం నుంచి విముక్తి, మేడారం సమ్మక్క-సారక్క జాతరకు జాతీయ హోదా, కనీసం ఒక్క ఐఐఎం, ఎన్ఐడీ విద్యాలయం, కనీసం ఒక్క ఐఐటీ, ఓ మెడికల్ కాలేజీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు  జాతీయ హోదా, బడ్జెట్లో ఉత్తరాది రాష్ట్రాలతో సమాన వాటా, 811 టీఎంసీల కృష్ణా జలాలతో సరైన వాటా, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ,స్మార్ట్ సిటీలుగా వరంగల్, కరీంనగర్’’ ఇవ్వాలని తెలంగాణ అడిగిందని, కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం గాడిద గుడ్డు ఇచ్చిందని ఎన్నికల్లో ప్రధాన ప్రచార అస్త్రంగా వాడుకుంటుంది. 

Read More విప్లవ సింహం నల్లా నరసింహులు 

ఏడు గాడిద గుడ్లతో తిప్పికొడుతూ..
కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని బీజేపీ సోషల్ మీడియా వేదికగా తిప్పికొట్టింది. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల హామీలపై గాడిద గుడ్డును ఎక్కుపెట్టింది. ‘‘2 లక్షల రుణమాఫీ 1వ గుడ్డు, వరికి రూ.500 బోనస్ 2వ గుడ్డు, కౌలురైతులకు రూ.15 వేల రైతు బోనస్ 3వ గుడ్డు, రైతుకూలీలకు రూ.12 వేల సాయం 4వ గుడ్డు, విద్యార్థులకు రూ.5లక్షలు 5వ గుడ్డు, నిరుద్యోగులకు  నెలకు రూ.4 వేలు 6వ గుట్టు, మహిళలకు రూ.2500 7వ గుడ్డు ఇచ్చిందంటూ సెటైరికల్‌గా తిప్పికొట్టింది. 

కొత్తగా పుట్టుకొచ్చిన వంకాయ
గాడిద గుడ్డు ప్రచారాన్ని ఖండిస్తూ వచ్చిన బీజేపీ తాజాగా వంకాయను రంగంలోకి దింపింది.  గాడిద గుడ్డుకు కౌంటర్‌గా వంకాయలను చేతబట్టి కాంగ్రెస్ రాష్ట్రానికి ఇచ్చింది ఇదే అంటూ కొత్త ప్రచారాన్ని అందుకుంది.  60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేశానికి వంకాయ, 120 రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ఇచ్చింది వంకాయ, ఉద్యోగులకు, మహిళలకు, నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి ఇచ్చింది వంకాయ అంటూ బీజేపీ విస్త్రృతంగా ప్రచారం చేస్తోంది. తెలంగాణ సమాజానికి సీఎం వంకాయ చేతిలో పెట్టాడని, ఈ వంకాయ సీఎం రేవంత్ రెడ్డిని ఇంటికి పంపిద్దామని పిలుపునిస్తున్నారు. ఈ సెటైరికల్ ప్రచారం ప్రజలను తెగ ఆకట్టుకుంటుంది. మరి రాబోయే రోజుల్లో ‘వెంట్రుకలు’ ప్రచారంలోకి వచ్చినా ఆశ్చర్చపోవాల్సిన అవసరం లేదేమో..!