బాధితులకు తక్షణ న్యాయం చేయాలి
- రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య
విశ్వంభర, విద్యానగర్ : జీవో 317 అర్థంపర్థం లేని నిర్ణయమని, అది ఉద్యోగుల జీవితాలను కుదిపేసిన పీడకలగా మారిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య విమర్శించారు. ఈ జీవో కారణంగా ఉద్యోగ దంపతులు వందల కిలోమీటర్ల దూరంలో పనిచేస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. హైదరాబాదు విద్యానగర్ బీసీ భవన్‌లో బి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జీవో 317 బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జీవో 190 ద్వారా తాత్కాలిక బదిలీలు, డిప్యూటేషన్ అవకాశాలు కల్పించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. సబ్ కమిటీ సిఫారసుల మేరకు దరఖాస్తు చేసుకున్న ప్రతి బాధితుడికి జీవో 190 ద్వారా న్యాయం చేయాలని కోరారు. అదే విధంగా ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేయాలని, వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నారాయణ, జ్ఞానేశ్వర్, ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్, రఘునందన్, చంద్రకళ, జయమ్మ, శ్రీనివాసులు, నీలా వెంకటేష్, నిఖిల్ పాల్గొన్నారు.



