బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి అరెస్ట్.. -హైదరాబాద్‌లో ప్రభుత్వ నిర్లక్ష్యంపై బీజేపీ ఉద్యమం
On
విశ్వంభర, హైదరాబాద్ :- గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఇటీవల కరెంట్ షాక్‌ల వల్ల పౌరులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరం. రోడ్లపై అల్లకల్లోలంగా ఉన్న విద్యుత్ తీగలు, పనిచేయని వీధి దీపాలు, డ్రైనేజీ లోపాలు, తాగునీటి సమస్యలు – ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య పాలనకు తార్కాణం. ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్న ఈ పరిస్థితిని నిరసిస్తూ బిజెపి రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం గడ్డిఅన్నారం డివిజన్ బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి సెక్రటేరియట్ వద్ద నిరసన చేపట్టారు. అయితే ప్రభుత్వ వైఫల్యాలను బయటపెట్టకుండా అడ్డుకోవాలని చూసిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి బేగం బజార్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ సందర్బంగా గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... ప్రజల ప్రాణాలను కాపాడటం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య పాలనతో ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతోంది. నగరంలో కరెంట్ ప్రమాదాలు, డ్రైనేజీ సమస్యలు, తాగునీటి లోపాలు తక్షణమే పరిష్కరించాలి. ప్రజల భద్రత కోసం మేము ఎప్పటికీ వెనుకడుగు వేయం. అవసరమైతే బీజేపీ మరింత తీవ్ర నిరసనలకు సిద్ధంగా ఉంటుంది. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మా పోరాటం కొనసాగుతుంది. ఈ నిరసనలో బీజేపీ ఎల్బీనగర్ ఇంచార్జ్ సామా రంగారెడ్డి, కొత్తపేట డివిజన్ బీజేపీ కార్పొరేటర్ నాయికోటి పవన్ కుమార్, పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని అరెస్టయ్యారు.



