రామన్నపేట లో బడి బాట
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని సంజీవయ్యనగర్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఆధ్వర్యంలో నేడు 'బడిబాట" కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ఆవాస ప్రాంతంలో ప్రతి ఇంటికి తిరుగుతూ తల్లిదండ్రులను కలిసి పిల్లలను పాఠశాలలో చేర్పించాల్సిందిగా అభ్యర్థించడం జరిగింది. ఐదు సంవత్సరములు నిండిన పిల్లలు కచ్చితంగా ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో చేరాలని గ్రామ ఉపసర్పంచ్ మోటె రమేష్ ఈ సందర్భంగా తెలియజేశారు. వార్డు మెంబర్ కొమ్ము రామస్వామి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో పౌష్టికాహారంతో పాటు ఉచిత యూనిఫారం, నోటు పుస్తకాలు, రాగి జావ ఇస్తున్నందున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పెద్ద మొత్తంలో పిల్లలను పాఠశాలలో చేర్చాలని కోరారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జలజాక్షి ప్రభుత్వ పాఠశాలలో గుణాత్మక విద్య, చక్కటి క్రమశిక్షణతో తరగతి గదులు నిర్వహిస్తున్నందున పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పాఠశాలలో చేరాలని కోరారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ సునీత, పాఠశాల ఉపాధ్యాయులు పుష్పావతి, నాగయ్య, అబ్దుల్ రహీం, కుమారస్వామి, సునీత తదితరులు పాల్గొన్నారు.



