ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్‌కు మూడు వారాల 'డెడ్ లైన్'

ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్‌కు మూడు వారాల 'డెడ్ లైన్'

తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. గత విచారణల తర్వాత స్పీకర్ తీసుకున్న నిర్ణయాలను, తాజా పరిణామాలను సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ ధర్మాసనానికి వివరించారు.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. గత విచారణల తర్వాత స్పీకర్ తీసుకున్న నిర్ణయాలను, తాజా పరిణామాలను సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ ధర్మాసనానికి వివరించారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకున్నారని, మిగిలిన వారి విషయంలో మరికొంత సమయం కావాలని కోరారు.

మున్సిపల్ ఎన్నికల సాకు
ప్రస్తుతం తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావుడి నెలకొన్న నేపథ్యంలో, ఈ పిటిషన్లపై విచారణను మార్చి మధ్య వరకు వాయిదా వేయాలని అభిషేక్ సింఘ్వీ కోర్టును అభ్యర్థించారు. అయితే, బీఆర్ఎస్ తరఫు న్యాయవాది మోహిత్ రావు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. "నాలుగు వారాల్లో పూర్తి చేస్తామని గతంలో చెప్పి, ఇప్పుడు ఎన్నికల సాకుతో కాలయాపన చేస్తున్నారు" అని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఫిరాయింపులకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, ఒక ఎమ్మెల్యే ఏకంగా కాంగ్రెస్ తరఫున ప్రచారం కూడా చేశారని కోర్టుకు వివరించారు.

Read More గత హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ ఆర్థిక వ్యవహారాల్లో భారీ అక్రమాలు.- ఒక కన్వెన్షన్ సెంటర్‌కు  రూ. 32 లక్షలు చెల్లింపులు. - నిధుల దుర్వినియోగంపై మూడు సార్లు నోటీసులు ఇచ్చినా గత బాధ్యులు స్పందించలేదు: హెచ్‌బీఎఫ్‌ అధ్యక్షుడు క‌వి యాకూబ్‌, కార్యదర్శి వాసు.

సుప్రీంకోర్టు హెచ్చరిక
ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టీన్ జార్జ్‌ల ధర్మాసనం స్పీకర్ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ గౌరవిస్తారని ఆశిస్తున్నామని పేర్కొంది. మిగిలిన కేసుల్లోనూ మూడు వారాల్లోగా తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. లేనిపక్షంలో కోర్టు ధిక్కరణ చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని ధర్మాసనం స్పష్టం చేస్తూ విచారణను వాయిదా వేసింది.

ఒకవైపు మున్సిపల్ ఎన్నికల ప్రచారంతో రాష్ట్రం హోరెత్తుతుంటే, మరోవైపు సుప్రీంకోర్టు విధించిన ఈ మూడు వారాల గడువు అధికార కాంగ్రెస్ పార్టీకి సవాలుగా మారింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ లోపే మిగిలిన ఎమ్మెల్యేల భవితవ్యాన్ని తేలుస్తారా? లేక సుప్రీంకోర్టు కఠిన చర్యలకు దిగుతుందా? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.