రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీ కటాఫ్ తేదీ ఫిక్స్
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం రైతు రుణమాఫీ హామీ. ఈ హామీ చుట్టూనే అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి.. మాట తప్పిందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. దీంతో.. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కూడా రైతు రుణమాఫీ అంశం చుట్టూ తిరిగింది. అంతేకాదు.. రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు అన్నారు. దీంతో.. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో రుణమాఫీ అంశమే కీలకమైంది. అయితే.. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. రైతు రుణమాఫీ చేసిన తర్వాత హరీష్ రావుతో మాట్లాడుతానని అన్నారు.
ఇచ్చిన మాట ప్రకారమే తెలంగాణ ప్రభుత్వం రూ. 2 లక్షల రుణమాఫీపై కసరత్తు మొదలు పెట్టింది. అందులో భాగంగా తాజాగా రుణమాఫీకి 2023 డిసెంబర్ 9 కటాఫ్ తేదీగా ప్రభుత్వం ఎంచుకున్నట్లు తెలుస్తోంది. రుణమాఫీ చేసేందుకు రూ.30 వేల కోట్లు అవసరం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో.. రైతు సంక్షేమ కార్పొరేషన్‌కు రైతుల రుణాలను బదిలీ చేసుకోవాలని కాంగ్రెస్ సర్కారు భావిస్తోంది.
అంతేకాదు.. మరిన్ని ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషణ చేస్తోంది. ప్రతీ కుటుంబానికి రూ. 2 లక్షల రుణమాఫీ మాత్రమే ప్రభుత్వం చేస్తోంది. అంతకంటే ఎక్కువ ఉంటే..ఆ రుణాలను రైతులే చెల్లించుకోవాల్సి ఉంటుంది. రైతులు రుణాలకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. ఒకటి కంటే ఎక్కు వ బ్యాంకుల్లో రుణాలు ఉంటే అలాంటి లెక్కలను కూడా సేకరిస్తున్నారు. బంగారం తాకట్టు పెట్టి చేసిన అప్పు కూడా మాఫీ చేస్తారని సమాచారం అందుతోంది.