డ్రైవర్ల రాత మార్చనున్న ‘భారత్ టాక్సీ’
- కేంద్ర మంత్రి అమిత్ షా
విశ్వంభర, నేషనల్ బ్యూరో: ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో 'భారత్ టాక్సీ' ప్రాజెక్టు విశేషాలను వివరిస్తూ కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. కష్టపడి పనిచేసే సామాన్యుడికే లాభాలు దక్కాలనే ఉద్దేశంతో 'భారత్ టాక్సీ'నీ తీసుకువచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ప్రైవేట్ ట్యాక్సీ కంపెనీలు డ్రైవర్ల సంపాదనలో 30 శాతం వరకు కోత విధిస్తున్నాయని, కానీ భారత్ టాక్సీలో డ్రైవర్లే యజమానులుగా ఉంటారని ఆయన స్పష్టం చేశారు. ఈ భారత్ టాక్సీ ప్రాజెక్టులో డ్రైవర్లు కేవలం రూ. 500 పెట్టుబడితో చేరవచ్చని అమిత్ షా వివరించారు. దీని లాభాల పంపిణీ గురించి వివరిస్తూ.. మొదటి మూడు ఏళ్ల పాటు డ్రైవర్లకు నిర్ణీత అద్దె లభిస్తుందని, అయితే ఆ తర్వాత వారు లాభాల్లో వాటా పొందుతారని తెలిపారు. ఉదాహరణకు సంస్థ రూ. 25 కోట్లు సంపాదిస్తే, అందులో 20 శాతం నిధులు ట్యాక్సీ మూలధనంగా జమ అవుతాయని, మిగిలిన 80 శాతం లాభాలను డ్రైవర్లు నడిపిన కిలోమీటర్ల ఆధారంగా నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తామని వెల్లడించారు. "సాధారణ కంపెనీల లక్ష్యం ధనవంతులను మరింత ధనవంతులుగా చేయడం, కానీ మా లక్ష్యం కష్టపడే డ్రైవర్లను యజమానులను చేయడం" అని అమిత్ షా పేర్కొన్నారు. డ్రైవర్లు కేవలం పని వారే కాకుండా లాభాల్లో వాటాదారులుగా మారతారని, అయితే ఈ ఫలితాలు అందడానికి మొదటి మూడు ఏళ్ల పాటు కొంత ఓపిక పట్టాలని ఆయన సూచించారు. ఈ విధానం వల్ల ట్యాక్సీ రంగంలో డ్రైవర్ల దోపిడీకి అడ్డుకట్ట పడుతుందని ఈ సందర్భంగా అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు.



